ఒక సినిమా తీయడమనేది అంత ఈజీ కాదు, అది కోట్లల్లో చేసే ఒక పెద్ద వ్యాపారం. విజయాలు వెన్నంటి ఉన్నంతవరకు అందరు స్నేహితులే, కానీ ఒక్కసారి అపజయం దరిచేరిందంటే మాత్రం స్నేహితులు కూడా తనను దూరం పెట్టేస్తారు. ఇప్పుడు యువ సంగీత కెరటం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కి సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇప్పటికీ దేవికున్న డిమాండ్ పెద్దగా ఏ మాత్రం తగ్గకపోయినా, తన సంగీతంలో, తనిచ్చే స్వరాల్లో ముందు ఉన్నంత కొత్తదనం, ఫీల్ ఇప్పుడు ఖచ్చితంగా లేవనే చెప్పాలి. తెలుస్గు సినీపరిశ్రమలోని దాదాపుగా అందరు స్టార్ హీరోలతో కలిసి దేవి పనిచేసినా, తనకు అల్లు అర్జున్ తో మాత్రం తప్పకుండా మంచి సాన్నిహిత్యం కుదిరిందనే చెప్పాలి.
అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్… ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో ఈ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ‘ఆర్య’, ‘ఆర్య 2’, ‘బన్నీ’, ‘జులాయి’, ‘సన్ అఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్లున్నాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్లాప్ సినిమాలకి కూడా దేవి శ్రీ మంచి మ్యూజిక్కే ఇచ్చాడు. వ్యక్తిగతంగా కూడా ఇద్దరూ బాగా క్లోజ్, ఇద్దరి మధ్యా మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. కేవలం బన్నీ గురించే ఇష్టం లేకపోయినా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు దేవి అనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వీరిద్దరి మధ్య ఇప్పుడు గ్యాప్ వచ్చిందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ అస్సలు డిమాండ్ లో లేడు, పైగా రొటీన్ ట్యూన్స్ ఇస్తున్నాడనే విమర్శలు కూడా దేవి ఎదుర్కొంటున్నాడు. అల్లు అర్జున్, తన ‘నా పేరు సూర్య’ సినిమాకి విశాల్ శేఖర్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ తో చేస్తున్న ‘అల వైకుంఠపురంలో’ సినిమాకి కూడా తమన్ ని రికమెండ్ చేశాడు. ‘ఐకాన్’ కు కూడా అనిరుద్ ని ఫైనల్ చేసాడని తెలుస్తుంది. ఇదంతా పక్కన పెట్టినా సుకుమార్ సినిమాకి కూడా దేవి శ్రీ మ్యూజిక్ వద్దు అని చెబుతున్నాడట బన్నీ. సుకుమార్ కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే.. ప్రతీ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ని తప్ప మరో మ్యూజిక్ డైరెక్టర్ ను పెట్టుకోడు. అలాంటిది బన్నీ ఇలా చెప్పేసరికి సుకుమార్ కూడా షాక్ అయ్యాడట. ఎలాగైనా బన్నీని ఒప్పించాలని సుకుమార్ చాలా ట్రై చేస్తున్నాడట. అయితే సుకుమార్ ప్రాజెక్ట్ ను కూడా బన్నీ ఇంకా ఫైనల్ చేయలేదనే మరో ప్రచారం కూడా జరుగుతుంది. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.