ఏపీ ముఖ్యమంత్రి జగన్ , టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా..? యస్.. అంటున్నాయి వైసీపీ వర్గాలు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మారు క్షణమే అవంతి తన మార్కును శాఖ మీద, విశాఖ మీద చూపించే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో తన వాసనకు పసిగట్టే అధికారులను ఎంచుకున్నారు. విశాఖ జిల్లా ఇంచార్జి, వైసీపీలో నెంబర్ టూగా వున్న ఎంపీ అయిన విజయ సాయిరెడ్డిని కూడా లెక్కచేయకుండా తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు అవంతి. పైగా తాను పార్టీలో ఉన్న అందరికంటే రాజకీయాలలో సీనియర్ అని చెప్పుకుంటుంటారు. మరి ఇలాంటివి ఓ ప్రాంతీయ పార్టీలో, జగన్ లీడర్‌గా వున్న పార్టీలో అస్సలు చెల్లుబాటు కావుగా..!
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అవంతి గొంతు మీదకు గోదావరి బోట్ ప్రమాదం వచ్చి పడింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి పెద్ద బాడ్ టాక్ వచ్చింది. పైగా ఈరోజు వరకు 15 మంది జాడ తెలియకుండానే ఉంది. మృతుల కుటుంబాలకు కనీసం మృతదేహాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలన్నీ కలిసి గొడవలు చేస్తున్నాయి. పైగా మాజీ ఎంపీ హర్షకుమార్ బోటు పాపంలో అవంతికి భాగం ఉందని కామెంట్ చేయటం , మృతుల బంధువులతో కలిసి ధర్నాలు చేయడం వగైరా జరిగాయి.
ఈ బురదను కడిగించు కోవాలంటే ప్రభుత్వం ముందు ఉన్న ఒకే ఒక మార్గం ఆ శాఖ మంత్రి రాజీనామా..! ఇదే అస్త్రాన్ని జగన్, అవంతి ముందు ఉంచారు. పార్టీలోని కొందరు పెద్దల చేత ఈ విషయం అవంతి చెవిలో వేయించారు. తద్వారా ప్రభుత్వానికి మంచి మైలేజ్ వస్తుంది భావించారు.
ఐతే, నేను రాజీనామా చెయ్యను గాక చెయ్యను అని మొండికేశారు అవంతి. ఇందులో అసలుె నా తప్పు లేదు అని ఖరాకండిగా చెప్పేసి అక్కడితో మేటర్ తెగ్గొట్టేశారు.
కానీ, ఇక్కడ మేటర్ సీరియస్ అవ్వడం షురూ అయ్యింది. అవంతి శ్రీనివాసుకి బోటులో వాటా ఉంది అంటూ ప్రచారం మొదలయింది.
వీరి పని ఇలా ఉందా అని, విశాఖలో పులివెందుల గ్యాంగ్ సెటిల్‌మెంట్‌ను తాపీగా బయటికి తెచ్చారు అవంతి శ్రీనివాస్.
విశాఖ నగరానికి చెందిన పారిశ్రామికవేత్త నరేషుకుమార్‌కు చెందిన భూవివాదంలో వేలు పెట్టిన పులివెందుల బ్యాచ్ వ్యవహారాన్ని అమాంతం అవంతి తెరమీదకు తెచ్చారు.
ప్రధానంగా ఈ మాఫియాలో పులివెందుల ఆంధ్రాబ్యాంక్‌లో పనిచేస్తూ రాజీనామా చేసి భూదందాలకు దిగిన బాలనారాయణరెడ్డి జగన్ తండ్రి వైఎస్‌కు చాలా సన్నిహితుడు. ప్రస్తుతం వైఎస్సార్ ఫ్యామిలీ కడపలో వాడుతున్న గెస్థ్ హౌస్ కూడా ఇతనిదే. మరో వ్యక్తి లింగాల రామలింగారెడ్డి అలియాస్ వేల్పుల రాము. ఇతను కూడా జగన్‌కు సన్నిహితుడు కావడంతో ఈ వ్యవహారాన్ని తెలివిగా బయటికి తెచ్చి కొందరికి లీకులు ఇచ్చి తన జోలికి రాకుండా చేసుకున్నాడని వైసీపీ విశాఖ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
ఈ వ్యవహారాన్ని జగన్ కూడా అంతే సీరియస్‌గా తీసుకుని కేసులు పెట్టమని చెప్పారట. ఈ వ్యవహారం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్‌గా మారింది. ఇలావుంటే, అవంతి వైసీపీకి ఈవిధంగా దూరమైతే తను ఎంటరవ్వచ్చునని టీడీపీ నుంచి ఇటేపు చూస్తున్న ఓ సీనియర్ పొలిటీషియన్ భావిస్తున్నట్టు వినికిడి.