గులాబీ కారులో అసంతృపి మొదలైంది, మంత్రిపదవి రాని నేతల గోల మొదలైంది. ఓవర్ లోడుతో వెళ్తున్న కారులో ఉక్కపోత స్టార్ట్ అయ్యింది. బరువును ఎలా దించుకోవాలో అని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. రాజకీయ కుంభకర్ణుడి అవతారం ఎత్తిన కేసీఆర్ ఇక తెలంగాణలో టిఆర్ఎస్ తప్ప ఎవరూ ఉండకూడదు అనే అత్యాశతో అన్ని పార్టీలలో ఉన్న నేతలను కారులో ఎక్కించుకున్నారు. ఇప్పుడు సీట్ల పంచాయతీ మొదలయ్యే సరికి తల పట్టుకుంటున్నారు. తెలంగాణ నలుదిక్కులా గులాబీ బాస్‌పై పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారు.
ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో సమస్య గులాబీని తినేస్తున్నాయి. పార్టీకి చేయాల్సిన నష్టాన్ని చేస్తూ కేసీఆర్ మా దేవుడు అని ఒక డైలాగ్ బయటకు వదులుతున్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ వాటిని నెరవేర్చలేక పోయారు. ప్రతి నియోజకవర్గంలో నేతల మధ్య సయోధ్య లేక కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు, ప్రజల్లో పార్టీ పరువు మూసిలో కలుస్తుంది అని బాధపడుతున్నారు. జోగులాంబ నుంచి ఆదిలాబాద్ దాకా కారులో కొట్లాట నడుస్తూనే ఉంది. మహాబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లికి జంపింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి అసలు పొసగడం లేదు. ఉద్యమం కోసం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన జూపల్లి కృష్ణారావు 2014లో టీఆర్ఎస్ తరుపున గెలిచి మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన తనకు ఏదో ఒక పదవి ఇవ్వకపోతారా అని ఆశతో ఉన్న జూపల్లికి తనపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షవర్దన్‌ను పార్టీలో చేర్చుకొని నియోజకవర్గంలో ప్రాధాన్యం ఇవ్వడం అసలు మింగుడు పడటం లేదు. దాంతో ఇక టిఆర్ఎస్‌లో ఉంటే భవిష్యత్తు లేదనే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ తన నిరసన గులాబీ బాస్‌కు తెలిసేలా వ్యవహరిస్తున్నారు. ఒక పక్క కేసీఆర్ మా బాస్ అని చెప్తూనే మరోపక్క కేసీఆర్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో రంగారెడ్డి జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న మహేందర్ రెడ్డి కూడా అసంతృప్తిగానే ఉన్నారు. తనపై గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంతో జిల్లాలో కాదు కనీసం తన నియోజకవర్గం తాండూరులో కూడా డమ్మీ అయిపోయాడు. వచ్చే ఎన్నికల్లో కూడా తాండూరు టికెట్ పైలెట్ రోహిత్ రెడ్డికే ఇస్తాం అని గులాబీ బాస్ చెప్పడంతో భవిష్యతు ఏంటి అన్న ఆలోచనలో పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. తన తమ్ముడు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తన అసంతృప్తిని కేసీఆర్‌కు తెలియచేయడానికే తమ్ముడిని అటు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గం తాండూరులో కూడా టీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. మహేందర్, రోహిత్ ఇద్దరు తాండూరులో పార్టీని కాగ్నా నదిలో కలిపేస్తున్నారని గులాబీ కార్యకర్తలు తెగ బాధ పడుతున్నారు. తాండూరులో ఇక తనకు భవిష్యతు లేదు అని నిర్ణయానికి వచ్చిన మహేందర్‌రెడ్డి చేవెళ్లపై దృష్టి పెట్టారు. చేవెళ్ల రిజర్వుడ్ సీటు అయినప్పటికీ నియోజకవర్గాల పునర్విభజనలో షాబాద్ కొత్త నియోజకవర్గంగా ఏర్పడుతుందని, అక్కడి నుంచి పోటీ చేయాలని మహేందర్‌రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం షాబాద్ చేవెళ్ల నియజకవర్గంలో ఉంది. ప్రతి విషయంలో మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటుండడంతో ప్రస్తుత ఎమ్మెల్యే యాదయ్య తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి ఎవరు శాసనసభ్యులో తెలియడం లేదని మహేందర్‌రెడ్డి తానే ఎమ్యెల్యేగా ఫీల్ అవుతున్నారని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహేందర్‌రెడ్డి దగ్గరకు వెళ్తే యాదయ్యకు పడదు. యాదయ్య దగ్గరకు వెళ్తే మహేందర్‌రెడ్డికి పడదు. దీంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో మరో నియోజకవర్గం మహేశ్వరంలో కూడా గులాబీకి అసమ్మతి బాధ తప్పడం లేదు. తీగల కృష్ణారెడ్డి, జంపింగ్ బ్యాచ్ మంత్రి సబితాకు అసలు పడటం లేదు. పార్టీకి ఆర్థికంగా ఎంతో సహాయం చేసిన తనకు పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని సన్నిహితుల దగ్గర తీగల బాధపడుతున్నారు. సబితకు మంత్రి పదవి ఇచ్చి నియోజకవర్గంలో తనకు భవిష్యతు లేకుండా చేశారని కేసీఆర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తానేంటో గులాబీ బాస్‌కు చూపిస్తా అని హెచ్చరికలు కూడా చేస్తున్నారట. నల్గొండ జిల్లాలో కూడా అసమ్మతులకు కొదవే లేదు. నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్ముల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట నియోజకవర్గంలో చెల్లుబాటు కావడం లేదని ఆయన వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. జంపింగ్ బ్యాచ్ కాంగ్రెసులో గెలిచి టిఆర్ఎస్‌లో చేరిన చిరుమూర్తి లింగయ్య కూడా అసంతృప్తిగానే ఉన్నారని సమాచారం. చేరిక సమయంలో తనకు ఇచ్చిన హామీలను పూర్తి చేయలేదని బహిరంగంగానే పార్టీ పై అసంతృత్తిని వెళ్లగక్కుతున్నారు. అటు వేముల విరేశం ఆంటీముట్టనట్లుగా ఉండటం, ఇటు చిరుమూర్తి లింగయ్య అసంతృప్తిగా ఉండడంతో నియోజకవర్గంలో కారు పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోందట. ఇక ఖమ్మం జిల్లాలో అయితే అసమ్మతికి కొదవే లేదు. పార్టీ బలహీనంగా ఉంది అని ఆ జిల్లా నుంచి టీఆర్ఎస్‌లో పెద్దఎత్తున చేర్చుకున్నారు. అదే ఇప్పుడు కారులో మంటలకు కారణం అవుతోంది. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావు మధ్య యుద్ధమే జరుగుతోంది. ఎప్పటి నుంచో రెండు వర్గాలుగా ఉన్న వనమ జలగం గ్రూపులు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. తామే నిజమైన టిఆర్ఎస్ లీడర్లమని జలగం బ్యాచ్ అంటుంటే, ప్రజలు, కేసీఆర్ మా వైపు ఉన్నారు అని వనమా వెంకటేశ్వరరావు వర్గం అంటోంది. గ్రామస్థాయిలో జరిగే ప్రతి పనిలో కూడా ఈ రెండు వర్గాలు కొట్టుకుంటుండడంతో కొత్తగూడెంలో పార్టీ పరువు పాతాళానికి వెళ్తోందని గులాబీ కార్యకర్తలు మధన పడుతున్నారు. పినపాకలో కూడా పరిస్థితి అలాగే ఉంది జంపింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు పాయం వెంకటేశ్వర్లు ఉప్పు నిప్పుగా ఉంటున్నారు. ఇక నియోజకవర్గం నాదే.. పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గాన్ని ఖాళీ చేయాలి అని రేగా కాంతారావు ప్రచారం చేస్తుండడంతో పాయం వెంకటేశ్వర్లు అధిష్టానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు వర్గాలు కూడా గ్రామ స్థాయిలో రెండుగా చీలిపోయారు.
ఇల్లందు కారులో ఉక్కపోత బాగానే ఉంది అక్కడ జంపింగ్ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, కోరం కనకయ్యకు అసలు పడటం లేదు. హరిప్రియా భర్త ఎక్కడికక్కడ వసూళ్లకు పాల్పడుతున్నారని కనకయ్య ఆరోపిస్తుంటే, హరిప్రియా ఎదురుదాడి చేస్తున్నారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ పార్టీ పరువు తీస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు. వైరా నియోజకవర్గంలో గులాబీ బ్యాచ్ కొట్టుకుంటున్నారు. ప్రస్తుత శాసనసభ్యుడు రాములు నాయక్, మాజీ ఎమ్యెల్యే మదన్‌లాల్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇక సత్తుపల్లిలో అయితే త్రిముఖ ఫైట్ నడుస్తుంది, కారు నాలుగు టైర్లను ముగ్గురు నేతలు చెరోవైపు లాగుతున్నారు. జంపింగ్ ఎమ్యెల్యే సండ్ర వెంకట వీరయ్య, రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన పిడమర్తి రవి, స్థానిక టీఆర్ఎస్ లీడర్ దయానంద్ మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. మంత్రి పదవి హామీతో టీఆర్ఎస్‌లో చేరిన సండ్రకు అప్పటికే టిఆర్ఎస్‌లో పాతుకుపోయిన పిడమర్తి రవి, దయానంద్ చుక్కలు చూపిస్తున్నారు. నియోజకవర్గంలో వరుసగా గెలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉన్న సండ్ర కారెందుకు ఎక్కాను అని తెగ బాధపడుతున్నారాట. ముగ్గురు నేతల మధ్య సత్తుపల్లిలో కారు ఎటు వెళ్తుందో అర్థం అవ్వడం లేదు అంటున్నారు సత్తుపల్లి గులాబీ బ్యాచ్. పాలేరు కారులో డ్రైవింగ్ కోసం మాజీ మంత్రి తుమ్మల, జంపింగ్ ఎమ్యెల్యే ఉపేందర్‌రెడ్డి మధ్య పెద్ద గొడవే జరుగుతోంది. తనపై గెలిచిన ఉపేందర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం, మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తుమ్మల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అవసరానికి కేసీఆర్ తనని వాడుకొని వదిలేశాడని సన్నిహితుల దగ్గర తన అసంతృప్తిని తెలియచేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా గులాబీ బాస్‌కు నిద్ర పట్టనివ్వడం లేదట. భూపాలపల్లిలో కూడా కారు నాలుగు చక్రాలను ముగ్గురు నేతలు తలోదిక్కు లాగుతున్నారు. జంపింగ్ ఎమ్యెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్న హామీతో గండ్ర సత్యనారాయణను టిఆర్ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్ టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని, ఎమ్మెల్సీఇస్తా అన్న హామీ కూడా నెరవేర్చకపోగా నియోజకవర్గ ఇంచార్జ్ కూడా ఇవ్వలేదని తీవ్ర నిరాశతో ఉన్నారు, కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఉన్న తన నియోజవర్గంలో గండ్ర వెంకటరమణరెడ్డిని పార్టీలోకి తీసుకొని ఆయనకే నియోజకవర్గంలో పెద్దపీట వేస్తుండడంతో మధుసూదనాచారి ఆగ్రహంగా ఉన్నారు. తన కొడుకులకు భవిష్యత్తు లేకుండా పోతుందనే ఆందోళనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలని అనుకుంటున్న ముగ్గురు నేతలు కూడా బహిరంగంగానే విమర్శలు చేసుకుంటూన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ విచిత్ర పరిస్థితి ఉంది. మాజీ మంత్రులు ఇద్దరు అక్కడ ఆధిపత్య పోరులో ఉన్నారు. సొంత నియోజకవర్గంలో కొట్టుకుంటున్న ఇద్దరు నేతలు కూడా అధినాయకత్వంలో అసంతృప్తిగా ఉన్నారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని, తరువాత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఆగ్రహంగా ఉన్నారు. మరో మాజీ మంత్రి రాజయ్య అటు నియోజకవర్గంలో కడియంతో ఫైట్ చేస్తూనే అధిష్ఠానంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇద్దరి నేతలకూ కారు మీద ప్రేమ తగ్గడంతో నియోజకవర్గంలో స్టీరింగ్ పట్టుకునే వాళ్లే లేకుండా పోయారు. నియోజకవర్గంలో గులాబీ రెక్కలు తెగే స్థితికి వచ్చింది. డోర్నకల్ టీఆర్ఎస్‌లో మంత్రి అండ్ ఎమ్మెల్యే మధ్య వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఎక్కడ పడటం లేదు. కలిసి పనిచేయాలని అధిష్టానం చెప్తున్నా నాయకులు మాత్రం పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో కూడా కారులో అసంతృప్తి పెద్దఎత్తున ఉంది. జంపింగ్ ఎమ్యెల్యే సురేందర్, మాజీ ఎమ్యెల్యూ ఏనుగు రవీందర్‌రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కేసీఆర్‌కు కష్టాల్లో తోడుగా ఉన్న తనను పక్కన పెట్టి పక్క పార్టీ ఎమ్యెల్యేకు ప్రాధాన్యం ఇస్తున్నారని అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్నారు. తన అసంతృప్తిని బహిరంగంగానే బయటకు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య అసంతృప్తి ఉంది. కేసీఆర్‌కు ముందు మాట్లాడడానికే భయపడే నేతలు ప్రస్తుతం డైరెక్ట్‌గా ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైనా తనకు ఎదురు మాట్లాడితే పార్టీ నుంచి బయటకు పంపించే కేసీఆర్, ఇప్పుడు బహిరంగంగా విమర్శలు చేస్తున్నా కూడా కనీసం వివరణ అడిగే పరిస్థితుల్లో లేరు. కారులో ప్రస్తుతం ఉన్న ఈ అసంతృప్తి ఏదో ఒక రోజు బయటపడుతుందని , పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలే ప్రమాదం ఉందని నేతలు భయపడుతున్నారు. మొత్తానికి కారు కష్టాలు కారువి అంటున్నారు పక్క పార్టీ నేతలు. ఎంత మంది నేతలు గులాబీని తీసుకెళ్లి కమలం చేతిలో పెడతారో వేచి చూడాలి