ఓనర్లు.. కిరాయిదార్లు.. స్టేట్ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. టీఆర్ఎస్‌కు తానూ ఓనర్‌నేనంటూ ఇటీవల ఈటెల చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీలో పెద్ద దుమారాన్నే రేపాయి. దీంతో రాజకీయ వర్గాలో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రం అవతరించి మొదటిసారి టీఆర్ఎస్ అధికారం దక్కించుకున్న తర్వాత వివిధ పార్టీల్లో గెలిచిన వారిని తమ పార్టీలో చేర్చుకుంది. వీరి చేరికతో ఆయా నియోజకవర్గాల్లో 2001 నుంచి పార్టీ కోసం కష్టపడి, తెలంగాణ ఉద్యమంలో సొంత ఆస్తులను అమ్ముకొని పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆ సందర్భంలోనే పార్టీలో యూటీ (ఉద్యమ తెలంగాణ) బ్యాచ్‌కు ప్రాధాన్యం తగ్గి బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచ్‌కు ప్రాధాన్యం పెరిగిందంటూ గులాబీ శ్రేణుల్లో బహిరంగంగానే చర్చ జరిగింది. దీనిపై పొలిటికల్ సర్కిల్‌లో అనేక సెటైర్లు వచ్చాయి. ఇప్పుడు ఈటల వ్యాఖ్యలతో యూటీ (ఉద్యమ తెలంగాణ), బీటీ (బంగారు తెలంగాణ) చర్చ పోయి, ఓనర్లు, కిరాయిదార్లు చర్చ మొదలైంది.
తాము గులాబీ ఓనర్లమే నంటూ ఈటల వ్యాఖ్యలు చేసిన తరువాత మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు కేసీఆర్ ఒక్కడే ఓనర్ అంటూ కామెంట్ చేశాడు. ఆ మరుక్షణమే కాదు కాదు పార్టీలో పనిచేసే వాళ్లందరూ ఓనర్లు అంటూ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించాడు. వీటికి తోడు పార్టీ సీనియర్ నాయకుడు మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉద్యమ సమయం నుంచి వాళ్లందరూ ఓనర్లేనని… టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేరిన వారందరూ కిరాయిదార్లు అని అన్నాడు. ఈ కిరాయిదార్లు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పోతారో తెలియదని సంచలన కామెంట్లు జోడించాడు. దీంతో ఓనర్లు ఎవరు… కిరాయిదార్లు ఎవరనే చర్చ ఊపందుకుంది. దీనిపై రాజకీయవర్గాల్లోనూ, ఇటు గులాబీ శ్రేణుల్లోనూ సెటైర్ల మీద సెటైర్లు వేసుకుంటున్నారు. కేవలం ఇది సెటైర్లకు మాత్రమే పరిమితం కాలేదు. విష జ్వరాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఆసుపత్రుల తనిఖీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వెళ్లిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల పర్యటనలో భాగంగా ఇల్లందులో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆ సందర్భంగా అక్కడకు వచ్చిన కొందరు ఉద్యమకారులు తామూ ఓనర్లమేనంటూ నినాదాలు చేశారు. అంతే కాకుండా ఖమ్మంలో ఆయనను కలిసేందుకు వచ్చిన కొందరు ఉద్యమకారులను పోలీసులు అడ్డుకోవడంతో.. తాము ఓనర్లమని, తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మీరు అడ్డుకుంటే కిరాయిదార్లను అడ్డుకోండని వాగ్వాదానికి దిగారు. మొత్తానికి ఓనర్లు.. కిరాయిదార్ల చర్చ హాట్ టాపిక్ మారి ఎటెటో దారి తీస్తోందని గుర్తించిన గులాబీ యువరాజు బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో అటువంటి కామెంట్లు ఎవరూ చేయవద్దని హుకుం జారీచేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీకీ ఓన్లరు ఉండరంటూ వివరణ ఇచ్చారు. దీని బట్టి ఓనర్లు, కిరాయిదార్ల చర్చ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.