దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోయింది. ఈ కోల్డ్ వేవ్ పరిస్థితులు గురువారం మరింత తీవ్రమయ్యాయి. విపరీతమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా అలుముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ చలి కారణంగా ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో గురువారం ఒక్క రోజే 25 మంది మరణించారు.
వీరంతా హార్ట్ ఎటాక్, బెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. వీరిలో 17 మంది ఎలాంటి వైద్య సహాయం అందక ముందే ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడించాయి. తీవ్రమైన చలి కారణంగా రక్తపోటు ఒక్కసారిగా పెరిగి రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లు వస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన అధ్యాపకుడు మాట్లాడుతూ.. చలి కారణంగా వచ్చే గుండెపోటుతో వృద్ధులే కాదు యుక్త వయసులోని వారు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వెచ్చటి వాతావరణంలో ఉండాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని చెప్పారు.
కార్డియాలజీ ఇనిస్టిట్యూట్ కంట్రోల్ రూం ప్రకారం.. గురువారం ఒక్కరోజే 723 మంది హృద్రోగులు ఎమర్జెన్సీ, ఓపీడీకి వచ్చారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న 41 మంది రోగులు ఆసుపత్రిలో చేరారు. అనంతరం చికిత్స పొందుతున్న ఏడుగురు హృద్రోగులు చలి కారణంగా ఆరోగ్యం విషమించి మృతి చెందారు.