నూతన సచివాలయంలో తొలిసారి సీఎం కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరగనుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం 21 రోజుల పాటు ఆ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్సవాల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
పోడు పట్టాలు, ఇళ్ల స్థలాల పంపిణీ, తొమ్మిదో విడత హరితహారంపై ఈ కలెక్టర్ల సదస్సులో చర్చిస్తారు. ఉదయం 11 గంటలకు సచివాలయం ఆరో అంతస్తులో ఈ సమావేశం జరగనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు,ఎస్పీలు ఇందులో పాల్గొంటారు. అదే విధంగా మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. రోజుకు ఒక రంగం చొప్పున.. ఆయా రంగాల వారీగా ప్రగతి ప్రస్థానాన్ని వివరించేలా కార్యక్రమాలు రూపొందించారు. గ్రామ స్థాయి మొదలు.. రాష్ట్ర రాజధాని వరకు కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. అయితే ఉత్సవాల నిర్వహణకు సంబంధించి జిల్లాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.
ఇక అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉత్సవాలను నిర్వహించాల్సిన తీరుతెన్నులపై వారికి వివరిస్తారు. ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల సమన్వయం ఇలా కీలక అంశాలపై ఈ సదస్సులో సీఎం చర్చిస్తారు. ఇక జూన్ 24 వ తేదీ నుంచి పట్టాలను సీఎం చేతుల మీదుగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో మిగిలిపోయిన నివాసయోగ్యమైన భూములను అర్హులైన పేదలను గుర్తించి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అదే విధంగా జూన్ 19 తేదీన తెలంగాణ హరితోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు.