తెలంగాణలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ త్రిపాఠి సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవించారు. ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ సంజీవయ్య ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించారు.
అయితే శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని డాక్టర్ సంజీవయ్య తెలిపారు. హాస్పటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్లు శ్రీదేవి, లావణ్య, సంధ్యారాణి, విద్య సిజేరియన్ చేసి ప్రసవం చేశారు. కాగా త్రిపాఠి మగబిడ్డ జన్మనిచ్చారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం బాగానే ఉందని, శిశువు 3.400 కిలోల బరువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించి జిల్లా ప్రజలకు కలెక్టర్ దంపతులు ఆదర్శంగా నిలిచారు. జిల్లా కలెక్టర్ గా భవేశ్ మిశ్రా బాధ్యతలు చేపట్టాక జిల్లా వైద్య అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించారు. వైద్య అధికారులతో చర్చిస్తూ రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియజేస్తూ అన్ని రకాల వైద్య సేవలను ప్రారంభించారు.
ఈ క్రమంలో కలెక్టరే స్వయంగా తన భార్యను ప్రభుత్వ దవాఖానలో డెలివరీ కోసం అడ్మిట్ చేయించి జిల్లా ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని రకాల వసతులతో జిల్లాకేంద్రంలో 100 పడకల దవాఖానను అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం.