సాత్విక్ ఆత్మహత్య కేసు మొత్తం కాలేజీ ఫ్యాకల్టీ, ప్రిన్సిపాల్ చుట్టే తిరుగుతోంది. కాలేజీ ఫ్యాకల్టీ వేధింపుల వల్లే సాత్విక్ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. సాత్విక్ ను బూతులు తిట్టడం వల్లే మనస్తాపం చెందాడని పేర్కొన్నారు.
విద్యార్థుల ముందు పదే పదే కొట్టడం వల్లే హర్ట్ అయ్యాడని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు స్పష్టం చేశారు. ఆచార్యతో పాటు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తరుచుగా తిట్టడంతోనే మానసికంగా సాత్విక్ కృంగిపోయాడు. చనిపోయే రోజు పేరెంట్స్ వచ్చి వెళ్లగానే స్టడీ అవర్ లో సాత్విక్ ను ఆచార్య,కృష్ణా రెడ్డి చితకబాదారు.
ఇంట్లో వాళ్ళని తిడుతూ వాళ్లిద్దరూ బూతులు మాట్లాడినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. హాస్టల్ లో సైతం సాత్విక్ కు వార్డెన్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి. అయితే ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.సాత్విక్ సూసైడ్ నోట్ ఈ కేసులో కీలకంగా మారింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
సాత్విక్ తన సూసైడ్ నోట్ లో కళాశాల ప్రిన్సిపల్ తో పాటు ఆచార్య, క్యాంపస్ ఇంఛార్జి నరేష్, శోభన్ లు తనను వేధిస్తున్నారంటూ రాశాడు. వారి నలుగురిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. పోలీసులు సైతం రిమాండ్ రిపోర్ట్ ఈ నలుగురి పేర్లను చేర్చారు. ఈ సంఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.