తన భార్యను హతమార్చేందుకు ఓ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బిచ్చగానిలా వేషం వేశాడంటే నమ్మలేం. కానీ చెన్నైలో జరిగిన ఈ ఉదంతం మాత్రం నిజం. ఇక్కడి నందనం ఆర్ట్స్ కాలేజీలో హిస్టరీ విభాగంలో ఈ పదవిలో ఉన్న ఎం. కుమారస్వామి అనే ఈయన.. తన భార్య జయవాణి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. బెగ్గర్ లా వేషం వేసి., ఈ నెల 17 న సాయంత్రం ఎగ్మూర్ లోని కాలేజీ వద్ద బస్సు లోనుంచి దిగుతున్న జయవాణి పై బ్లేడుతో దాడి చేశాడు.
అయితే ఆమె తన చేతులు అడ్డం పెట్టుకుని తనను తాను రక్షించుకుంటూ పరుగులు తీసింది.అందరూ చూస్తుండగానే.. కుమారస్వామి కూడా ఆమె వెంటబడి ఆమె శరీరంపై బ్లేడుతో గాయాలు చేశాడు. అయితే ఈ క్రమంలోనే తనపై దాడికి పాల్పడింది బిచ్చగాడు కాదని, తన భర్తేనని జయవాణి గుర్తు పట్టింది.
ఈలోగా స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసి కుమారస్వామిని పట్టుకున్నారు. తాను ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో పని చేస్తున్నానని, తన భర్తే ఇలా బెగ్గర్ లా వచ్చి తనపై దాడి చేశాడని జయవాణి వారికి తెలిపింది.
ఈ బిచ్చగాడు కమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ని పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరికీ వయస్సులో ఉన్న పెద్ద వ్యత్యాసం వల్లే కుమారస్వామి.. తన భార్య శీలం మీద అనుమానం పెంచుకున్నాడని వారు తెలిపారు. కుమారస్వామిని పెళ్లి చేసుకున్నప్పుడు జయవాణి స్టూడెంట్ అని తెలిసిందన్నారు. అతగాడు ఈమె ఫ్యామిలీ ఫ్రెండ్ అని, జయవాణి తండ్రికి స్నేహితుడని తెలిసింది. కుమారస్వామిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.