అమెరికాలో ప్రతీ ఏడాది ఎక్కడో ఒకచోట కార్చిచ్చు అంటుకోవడం కామన్ అయిపోయింది. వేడిగాలులు, ఉష్ణోగ్రతల కారణంగా మంటల ధాటికి అటవీ ప్రాంతం కాలి బూడదవుతుంటుంది. తాజాగా కొలరాడో రాష్ట్రంలో కార్చిచ్చు కలవరపెడుతోంది. అక్కడి అడవులను కాల్చేస్తూ ప్రజల ఇళ్ల వైపు దూసుకెళ్తోంది.
ఇప్పటిదాకా 122 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. మంటలు వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రజలను తరలిస్తున్నారు అధికారులు. దాదాపు 19,400 మందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. 8వేల ఇళ్లు మంటల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని అంటున్నారు అధికారులు.
గతేడాది కూడా ఇలాగే కార్చిచ్చు చెలరేగగా.. అప్పుడు వెయ్యి వరకు ఇళ్లు తగులబడ్డాయి. ప్రస్తుత కార్చిచ్చు కారణంగా 49 హెక్టార్లలో అటవీ ప్రాంతం కాలిపోయింది. ఇళ్లను కూడా బుగ్గి చేసేందుకు దూసుకెళ్తోంది.
గాలుల తీవ్రత అధికంగా ఉండడంతో మంటలు అదుపు కావడం లేదు. రెస్క్యూ టీమ్ వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రముఖ ఎల్డొరాడో కేన్యన్ స్టేట్ పార్కును మూసేశారు అధికారులు.