ప్రజాస్వామ్య వ్యవస్థ.. భారత్ గొప్పతనం గురించి ఐరాస వేదికగా ప్రధాని మోడీ ఇచ్చిన స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ పై ఆయన వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా వ్యాక్సిన్ కంపెనీలన్నింటినీ భారత్ కు రావాలని ఆహ్వానించారాయన.
వందేళ్లలో ఎన్నడూ లేని మహమ్మారితో ప్రపంచం పోరాడుతోందన్న మోడీ.. భారత్ ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ వ్యాక్సిన్ ను తయారు చేసిందన్నారు. 12 ఏళ్లు పైబడిన ఎవరికైనా దాన్ని వేయొచ్చని వివరించారు. అంతేకాదు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రతీ ఒక్కరికి నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు మోడీ.
సేవా పరమో ధర్మం మీద ఆధారపడిన భారతదేశం.. ప్రపంచంలోని పేదలకు వ్యాక్సిన్లు ఇస్తోందన్నారు ప్రధాని. పరిమిత వనరులు ఉన్నప్పటికీ టీకా అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఉన్న వ్యాక్సిన్ కంపెనీలు భారతదేశానికి వచ్చి.. తయారీ యూనిట్స్ పెట్టి ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు మోడీ.