టాలీవుడ్ కమెడియన్ సుధాకర్ చనిపోయినట్లు పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై సుధాకర్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో కూడా ఆయన విడుదల చేశారు. సుధాకర్ ఆరోగ్యం బాలేదని, ఐసీయూలో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పష్టతనిచ్చారు. ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దని, ఇలాంటి పుకార్లు సృష్టించొద్దని సూచించారు.
నా మీద కొన్ని రోజులుగా వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. ఇలాంటి పుకార్లను ప్రచారం చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను అని సుధాకర్ పేర్కొన్నారు.
సుధాకర్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న మనిషిపై ఇలాంటి పుకార్లు సృష్టించొద్దని అభిమానులు కోరుతున్నారు.
భారతీ రాజా తెరకెక్కించిన ఓ సినిమాతో సుధాకర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం విదితమే. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా కూడా అలరించి, అభిమానులను మెప్పించారు. తనదైన శైలిలో డైలాగులు చెప్పి సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక సహాయ నటుడిగా, విలన్‌గా నటించి.. తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సుధాకర్ ఆరోగ్యంపై గతంలోనూ పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.