వేణుమాధవ్ ఒక సాధారణ మిమిక్రీ ఆర్టిస్టు స్థాయి నుంచి స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. నాటి నల్గొండ జిల్లా నేటి సూర్యాపేట జిల్లా పరిధిలోని కోదాడలో 1969 డిసెంబర్ 30న సామాన్య కుటుంబంలో జన్మించిన వేణుమాధవ్ మిమిక్రీపై ఆసక్తి పెంచుకుని ఎంతో సాధనతో అందరినీ అలరించే స్ధాయికి ఎదిగారు. భార్య శ్రీవాణి, ఇద్దరు పిల్లలు మాధవ్ సావికర్, మాధవ్ ప్రభాకర్ ఉన్నారు.
అప్పటి కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు ప్రోత్సాహంతో ప్రభుత్వ పథకాలను మిమిక్రీ కళతో ప్రచారం చేసిఫేమస్ అయ్యారు. టీడీపీ సాంస్కృతిక విభాగంలోనూ పనిచేశారు. టీవీ యాంకర్ గాను రాణించారు. అప్పటి హోమ్ సినిమాటోగ్రఫీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి, పరిచయస్తుల సహకారంతో వేణుమాధవ్ సినీ రంగ ప్రవేశం చేశారు. 1996లో సంప్రదాయం మూవీలో తొలి అవకాశం వచ్చింది. తరువాత ఎన్నో మూవీల్లో కమెడియన్ గా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ఇలా 2016 డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ మూవీ వరకు చిత్ర హాస్య జైత్రయాత్ర సాగింది. 165 సినిమాల్లో హాస్యం పండించి అలరించారు.
గోకులంలో సీత, మాస్టర్, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, ఆది, దిల్, సింహాద్రి, ఆర్య, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్., మాస్, భూ కైలాస్, బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, రుద్రమదేవి తదితర చిత్రాల్లో హాస్యం పండించారు.
తనను వెండితెరకు పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోనే హంగామా సినిమాతో అలీతో కలిసి హీరోగా పరిచయం అయ్యారు. తరువాత భూకైలాష్, ప్రేమాభిషేకం సినిమాల్లో హీరోగా నటించారు. అంతేకాదు ప్రేమాభిషేకం సినిమాను తానే స్వయంగా నిర్మించారు. చివరగా రుద్రమదేవి సినిమాలో నటించిన వేణు మాధవ్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
2006లో రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డు ఇచ్చి సత్కరించింది.