సినీ ఆర్టిస్ట్, కమెడియన్ వేణుమాధవ్ మరిలేరు. సికిందరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12.20కు కన్నుమూశారు.
వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరారు. నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావటంతో బంధువులు సికింద్రాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్తూ వచ్చారు. వేణు మాధవ్ మధ్యాహ్నం 12.20 గంటలకు తుది శ్వాస విడిచినట్లు వేణుమాదవ్ బంధువులు తొలివెలుగు ప్రతినిధి రాకేష్‌కు తెలిపారు.
చివరిక్షణాల్లో తమ మిత్రుడిని చూడాలని వేణుమాధవ్ సహ నటులు శివాజీరాజా, ఉత్తేజ్ ఆసుపత్రికి వచ్చారు. ఇంతలో వేణుమాధవ్ తుదిశ్వాస విడిచారని తెలిసి వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. దశాబ్దాలుగా తమతో నడిచిన తమ ఆత్మీయ మిత్రుణ్ని అలా చూసి వారు జీర్ణించుకోలేకపోయారు.
వేణుమాధవ్ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ఆర్టిస్ట్. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరియర్ ఆరంభించిన వేణుమాధవ్ తరువాత వెండితెరపై అడుగుపెట్టి ఇప్పటివరకు 600కు పైగా సినిమాల్లో నటించారు. దాదాపు ప్రతి అగ్ర హీరో పక్కన నటించారు. తనదైన హాస్యంతో తెరపై నవ్వులు పూయించారు. లెక్కకు మించిన అభిమానుల్ని సంపాదించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేణుమాధవ్ ఎక్కడికి వెళ్లినా అసంఖ్యాకమైన అభిమానులు వున్నారు. ఇప్పటికీ రోజు వేణు మాధవ్ నటించిన చిత్రాల్లోని హాస్య సన్నివేశాలు చూసి జనం హాయిగా నవ్వుకుంటుంటారు. వేణుమాధవ్ రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా వున్నారు. తెలుగుదేశం పార్టీలో వుంటూ ఎన్నికల్లో క్యాంపేనర్‌గా రాష్ట్రమంతటా ప్రచార సభల్లో పాల్గొనేవారు.