రాజ్యసభలో 72 మంది సభ్యుల పదవీకాలం గురువారంతో ముగిసింది. ఇందులో కపిల్ సిబాల్, పీ. చిదంబరం, జైరాం రమేశ్, ఏకే ఆంటోనీ, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి లాంటి పలువురు ప్రముఖులు ఉన్నారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ అయిన సభ్యులను ఉద్దేశించి ప్రధాని మోడీ వీడ్కోలు ప్రసంగం చేశారు. వారంతా రాజ్యసభకు తిరిగి రావాలని తాను కోరుకుంటున్నట్టు ప్రధాని తెలిపారు.
‘ మన రాజ్యసభ ఎంపీలకు సుదీర్ఘ అనుభవం ఉంది. కొన్ని సార్లు విద్యా జ్ఞానం కన్నా అనుభవం చాలా ముఖ్యమైనది. మనం అనుభవంతో పొందిన జ్ఞానం సమస్యలకు సులువైన పరిష్కారాలను చూపిస్తుంది. అందుకే మీరంతా మళ్లీ సభకు తిరిగి రావాలి’ అని అన్నారు.
‘ మనమంతా పార్లమెంట్ లో చాలా కాలం కలిసి గడిపాం. మనం సభకు ఇచ్చిన దాని కంటే సభకు మనకు ఎంతో ఎక్కువగా ఇచ్చింది. ఇప్పుడు రాజ్యసభలో కొనసాగుతున్న సభ్యులపై అదనపు బాధ్యత ఉంటుంది. రిటైర్డ్ అవుతున్న వారి వారసత్వాన్ని మిగిలిన వారు ముందుకు తీసుకు వెళ్లాలని సూచించారు. పదవీ విరమణ చేస్తున్న రాజ్యసభ సభ్యుల నుండి నేర్చుకున్న పాఠాలను మనం ఉపయోగించుకోవాలి’ అని సూచించారు.
‘ ఈ సభను విడిచి పెట్టి వెళుతున్నాము. అయినప్పటికీ ఆ అనుభవాన్ని దేశంలోని నాలుగు దిక్కులకు తీసుకు వెళదాం. దేశానికి దిశానిర్దేశం చేసిన చారిత్రక ఘట్టాలను మన పదవీ కాలంలో ఏవైతో చూశామో వాటిని భవిష్యత్ తరాలకు సూచించేలా రికార్డ్ చేయాలి’ అని అన్నారు.