ఏటీ సూతకంలో వున్న వ్యక్తులు దేవాలయ దర్శనం చేయవచ్చునా.. ? ఎంతో ప్రాశస్థ్యం వున్న బ్రహ్మోత్సవాలలో పాల్గొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించవచ్చునా..? హైందవ ధర్మ ప్రచారకర్తలు, శ్రీవారి భక్తులు రెండురోజులుగా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. రాష్ట్రానికి ఎటువంటి ఉపద్రవం రాకూడదని శ్రీనివాసుడిని ప్రార్ధిస్తున్నారు.
తిరుపతి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బ్రహ్మోత్సవాల్లో అరుదైన ఘనతను సాధించి చరిత్రలో నిలిచిపోయారని మీడియా మొత్తం పతాక శీర్షికల్లో ప్రచారం చేసింది. అదే సమయంలో పిన తండ్రి చనిపోయి కొద్ది మాసాలు కూడా పూర్తవ్వని జగన్ తిరుమల క్షేత్రంలో జరిగే అంత పెద్ద ఉత్సవాలకు ఎలా వెళ్తారని జనం చెవులు కొరుక్కుని మాట్లాడుకుంటున్న విషయాన్ని మాత్రం కన్వీనియెంట్‌గా విస్మరించినట్టు కనబడుతోంది.
టీవీ5, ఏబీఎన్ న్యూస్ ఛానళ్ల బ్యాన్ తరువాత ఏ న్యూస్ ఛానల్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాయడానికి విపరీతంగా భయపడుతున్నారని జనం ఓపక్క మాట్లాడుకుంటున్నారు. వారి మాటల్ని నిజం చేస్తూ రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సీయం తిరుమల క్షేత్ర పర్యటన విషయాన్ని మీడియా పక్కనపెట్టేసింది.
దసరా పండగ ఈసారి ఎప్పుడు చేసుకోవాలి..? కృష్ణానదిలో మూడు మునకలు వేస్తే లాభమా..? నష్టమా..? గోదావరి పుష్కరాలకు ముందు ఆ ప్రాంతంలో పెద్ద గద్ద తిరగడమే అక్కడ జరిగిన అంత పెద్ద అనర్ధానికి కారణమా? అంటూ మామూలుగానే గంటలకొద్దీ చర్చలు పెట్టి జనాన్ని చావగొట్టే న్యూస్ ఛానల్స్ ప్రజల విశ్వాసాలు, అభిప్రాయాలకు సంబంధించిన ఈ ముఖ్యమైన అంశాన్ని విస్మరించడం శోచనీయమని హైందవ ధర్మ ప్రచారకులు అంటున్నారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం ఏ వ్యక్తికైనా తన రక్త సంబంధీకులు మరణిస్తే ఏడాది పాటు ఏటి సూతకం వుంటుంది. ఇదివరకు రోజుల్లో అయితే భగవదారాధనకు కూడా ఏడాది పాటు వారంతా దూరంగా వుండేవాళ్లు. ఐతే, ధర్మసూక్ష్మాలు తెలిసిన కొంతమంది పెద్దలు ఏడాది పాటు ఇంట్లో దేవుడికి దీపం కూడా పెట్టకుండా వుండటం సమంజసం కాదనే వాదనతో కొంత సడలింపు ఇచ్చారు. నిత్య పూజలు చేయవచ్చునని, కానీ, విశేష పూజలు చేయరాదని శాస్త్రం చెబుతున్నట్టు వివరణ ఇచ్చారు. ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ కలిసి పీటలపై కూర్చుని నోములు, వ్రతాలు వంటి విశేష పూజలలో పాల్గొనరాదని పెద్దలు చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ఆలయ సందర్శనకు సాధ్యమైనంత దూరంగా వుండాలని, ఒకవేళ దైవ దర్శనం చేసుకున్నా కొబ్బరికాయ కొట్టడం, గోత్రనామాలతో అర్చన చేయించడం వంటివి చేయించరాదని ధర్మ సూక్ష్మాలు తెలిసిన ఏ పండితుడిని అడిగినా చెబుతారు.
ఐతే, కొంతమంది వితండవాదులు బయల్దేరి ఏటి సూతకం వుంటే అర్చనలు ఎందుకు చేయించరాదంటూ అక్కడ కూడా స్వయం సడలింపులు ప్రకటించుకున్నారు. ఇది ధర్మ విరుద్ధమని, శాస్త్ర విరుద్ధమని తెలిసినా ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు కూడా ఏమీ చేయలేక వదిలేశారు. రానురాను ఈ సడలింపుల జాబితా పెరిగిపోతూ వస్తోంది. అసలు కొండ మీద వున్న పుణ్యక్షేత్రాలకు వెళ్లరాదని చాగంటి అంతటి ఉద్ధండ పండితులే చాలా స్పష్టంగా చెబుతున్నా ఏటిసూతకం వున్నా కూడా ఏడుకొండలు ఎక్కి శ్రీవారిని దర్శించుకునే వారు ఎందరో వున్నారు.
సామాన్య జనం సంగతి వదిలిపెడితే, రాష్ట్రానికి పెద్ద దిక్కుగా వుండాల్సిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. తన సొంత పిన తండ్రి మరణించి.. అది కూడా దుర్మరణం చెంది కొద్ది మాసాలే అవుతున్నా తిరుమల బ్రహ్మోత్సవాలకు అని చెప్పి బయల్దేరారు. తిరుమల అంటే ఆగమ పండితులకు ప్రధాన కేంద్రం. మరి అక్కడి వారు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదో.. చెప్పలేక వూరుకున్నారో తెలియదు కానీ, జగన్మోహన్‌రెడ్డి సీయం హోదాలో వెళ్లి స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించి వచ్చారు. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రిగా వుండే వ్యక్తి సతీసమేతంగా హాజరవ్వడం ఆనవాయితీగా వున్నప్పటికీ ఎందువల్లనో జగన్మోహన్‌రెడ్డి వెంట ఆయన శ్రీమతి వెళ్లలేదు. బహుశా, ఇతరత్రా కారణాల వల్లనో, లేదా ఇతర మత ఆరాధకురాలిగా వెళ్లడానికి సుముఖంగా లేకపోవడం వల్లనో తిరుమల అయితే వెళ్లలేదు. ఏటి సూతకంలో వున్నప్పుడు భార్యభర్తలు ఇరువురు దైవిక సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనకూడదనే నియమం ఇక్కడ కొంతలో కొంత వర్తించిందని ఏటీసూతకం గురించి పట్టుబట్టే వాళ్లు ఇక్కడ కాస్త సరిపెట్టుకోవాలి.
ఏటీ సూతకం అంటే ఏంటంటే.. మన రక్త సంబంధీకులు ఎవరైనా మరణించినప్పుడు ఏడాది పాటు నియమ బద్ధమైన జీవితాన్ని అనుభవించడం. అంటే, చనిపోయిన మనిషి ఏడాది పాటు తన సంబంధీకుల చుట్టూ తిరుగుతూ వుంటారనే జనం నమ్మకం ఆధారంగా ఆ ఏడాది కాలమంతా ఆ చనిపోయిన వ్యక్తిని స్మరిస్తూ.. ఆ చనిపోయిన వ్యక్తి చేసిన సేవల్ని గుర్తుచేసుకుంటే వుండటం కోసం చేసిన కట్టుదిట్టమైన ఏర్పాటే ఏటి సూతకం. ఇంట్లో వివాహాలు, ఇతర పుణ్యకార్యాలు చేయడం వల్ల మనుషులు సంతోషంలో మునిగి తేలి చనిపోయిన వ్యక్తిని మరచిపోయే అవకాశం వున్నందున ఈ విధమైన ఏర్పాటు మన పూర్వీకులు చేసి వుంటారని పెద్దలు చెబుతారు.
ఇవన్నీ హిందూ మత విశ్వాసాలు. ఇతర మతస్థులలో ఈ నమ్మకాలు లేకపోవచ్చు. వారికంటూ వున్న వేరే విధమైన విశ్వాసాలను వారు అనుసరించవచ్చు. లౌకిక వ్యవస్థలో ఎవరి విశ్వాసాలు వారివి. కానీ, తిరుమల తిరుపతి అంతటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దివ్య క్షేత్రంలో అడుగు పెట్టాలనుకునే వాళ్లు కచ్చితంగా కొన్ని హైందవ ధర్మ ఆచారాలను, సంప్రదాయాలను, పద్దతులను పాటించడం అనివార్యం. కానీ, కొండ మీద వుండాల్సిన ధర్మ పాలకుల ఎంపిక ఆధ్యాత్మిక మార్గంలో వున్నవారితో కాకుండా రాజకీయ, వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలకు సంబంధించిన వారితో జరుపుతున్నందున తిరుమలలో అచ్చంగా హైందవ ధర్మాల్ని ఆచరిస్తారని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది.
ఏటి సూతకంలో వున్నవారు దైవ కార్యాల్లో పాల్గొనవచ్చునా.. లేదా అనేది తెలుసుకోడానికి కింద వున్న వీడియో చూస్తే చాలు.. ధర్మ సూక్ష్మం ఏంటో బోధపడుతుంది.