ఏపీలో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకి మధ్య జరుగుతున్న పీఆర్సీ వార్ ఉత్కంఠ రేపుతోంది. ఇటీవలే ఈ సమస్యకు పరిష్కారం దొరికిందని అంతా భావించినా ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు ఆమోదయోగ్యంగా లేదని ఉద్యోగ సంఘాలు మళ్లీ ఉద్యమ బాట పట్టాయి. పైగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను పరిశీలిస్తే తమ జీతం తగ్గపోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యమం ద్వారానే తమ హక్కులు సాధించుకుంటామని అంటున్నారు. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. రోజు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమై ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. సోమవారం సీఎస్ ను కలిసి సమ్మె నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం. ఉద్యోగ సంఘాలు ఓవైపు సమర శంఖం పూరిస్తుంటే.. ప్రభుత్వం ఉద్యోగులను ప్రసన్నం చేసే పనిలో పడింది.
సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగ సంఘాల డిమాండ్లపై చర్చించారు. సుమారు గంటకుపైగా ఈ అంశంపై మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఉద్యోగులను సమ్మెకు వెళ్లకుండా బుజ్జగించేందుకు ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ఓ నిర్ణయానికి రానున్నాయి.