శ్రీకాకుళం: ఓ రోడ్డు పక్కన ఎన్ని పాద ధూళులనో మోస్తూ భరిస్తూ ఓ కుర్రాడు కొన్నేళ్లుగా చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని పేరు నకిడాపు చంద్రరావు. బతకడం కోసం ఉపాధి.. జీవించడం కోసం మార్షల్ ఆర్ట్స్ అనుకున్నాడు. నేర్చుకున్న విద్యను అందరికీ అందించాలని తలపోశాడు. అంతే, చెప్పులు కుడుతూనే ఆత్మ నిబ్బరం పెంచే మార్షల్ ఆర్ట్స్ శిక్షకునిగా కొత్త వ్యాపకం మొదలుపెట్టాడు. ఉచితంగానే మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఎంతోమందిని సుశిక్షితుల్ని చేశాడు. దాతల సాయంతో తన విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు తీసుకుని వెళ్తూ వారి విజయం తన విజయం అని భావిస్తున్నాడు. అన్నీ ఉంటే కాదు, ఏమీ లేకపోయినప్పుడే సాధించే విజయం గొప్పది. అందుకు తార్కాణం చంద్రరావు జీవితం. తండ్రి లేడు. ఆ విషాదాన్ని మోస్తూ కుటుంబ భారం మీదేసుకున్నాడు. చెప్పులు కుట్టే జీవనోపాధిని ఎంచుకున్నాడు. కుటుంబానికి ఆసరా అయ్యాడు.ఆ క్రమంలోనే తన గురువు సాయిబాబా దగ్గర నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌ని ప్రతిరోజూ నేర్పుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జాయింట్ కలెక్టర్ బంగ్లాకు సమీపంలో ఉన్న అబ్దుల్ కలాం పార్కులో క్రమం తప్పకుండా శిక్షణ ఇస్తూ ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నాడు.
మొన్ననే ఉన్నంతలోనే జిల్లా స్థాయి కరాటే కుంఫూ టోర్నీ ఒకటి నిర్వహించి శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఎనభై మంది విద్యార్థులకు ఉచితంగా ఆత్మరక్షణ విద్య నేర్పుతున్నానని చెబుతున్నాడు తోచిన రీతిన తనవంతుగా చిన్నారులకు పాఠాలు చెబుతున్నానని, ఇలా గడిచిన ఐదేళ్లుగా మాస్టర్ సాయిబాబా మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ పేరిట సొంతంగానే ఓ సంస్థ నిర్వహిస్తున్నానని తెలిపాడు. ఇప్పటికే తన దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు వివిధ స్థాయిలలో పతకాలు సాధించారని వివరించాడు. చెప్పులు కుట్టుకుంటూ జీవించే తనకు ఇలా ఆత్మ రక్షణ విద్యకు సంబంధించిన తరగతులను భోదించడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించాడు.
ఇది కదా విజయం. ఈ మాస్టారికి జేజేలు చెబుదాం.. ఈ గురుపూజోత్సవ వేళ మనస్ఫూర్తిగా అభినందిద్దాం.