• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

దేవులపల్లి అమర్ గారికి బహిరంగ లేఖ

Published on : October 31, 2019 at 12:26 pm

 

 

To
దేవులపల్లి అమర్
జాతీయ మీడియా వ్యవహారాల సలహాదారు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

అమర్ గారూ, మీకొక చిన్న సంఘటన గుర్తు చేయాలి. అది 1987. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీపుల్స్‌వార్ గ్రూప్ నక్సలైట్లు తీవ్రహింసకు పాల్పడుతున్న నేపథ్యంలో, అప్పటి పోలీస్ వ్యవస్థ నక్సల్ ఉద్యమంపైన ఉక్కుపాదాన్ని మోపిన రోజులు అవి. మీరు కరీంనగర్ జిల్లాకేంద్రంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో జర్నలిస్టుగా చేరారు. ఆ రోజుల్లో కరీంనగర్లో అప్రకటిత యుద్ధవాతావరణం, వాతావరణమంతా ఒక అవ్యక్త భయం ఉండేవి. ఎవరూ నోరు విప్పి మాట్లాడే పరిస్థితి లేదు. పోలీసులకు వ్యతిరేకంగానయితే అసలు నోరెత్తే పరిస్థితే లేదు. పత్రికాఫీసులకు పోలీసులు వచ్చి, ఈ వార్త ఎందుకు రాశారు ? సమాచారం ఎవరిచ్చారు అని ప్రశ్నించే పరిస్థితి. అదే సమయంలో జాడ తప్పిపోయిన అమ్మాయిల కేసుకి సంబంధించిన ఒక విచారణ కోసం ప్రముఖ మానవహక్కుల న్యాయవాది, పౌరహక్కులనేత కన్నబీరన్ తన జూనియర్ లాయర్స్‌తో కలిసి కరీంనగర్ కోర్టుకి మారుతీవ్యానులో వచ్చేవారు. ఆయన మజిలీ మీరు పనిచేస్తున్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆఫీసు. అప్పటి కరీంనగర్ ఎస్పీ మిమ్మల్ని ఒకరోజు పిలిపించి, కన్నబీరన్ బృందం మీ ఆఫీసుకు ఎందుకొస్తున్నారు అని ఆరా తీస్తే “నన్ ఆఫ్ యువర్ బిజినెస్ సర్” అని ఖండితంగా చెప్పారు మీరు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికలో పనిచేసే జర్నలిస్టుని, జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షుడిని, నా వెనక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉందనే ధైర్యం మీతో అలా మాట్లాడించింది.

పైన ఉన్న పేరాగ్రాఫ్‌లో ఒక్క అక్షరం కూడా నేను రాసింది కాదు. ప్రతి అక్షరమూ స్వయంగా మీరు రాసిందే. “కన్నబీరన్ ఆత్మకథాత్మక సామాజిక చిత్రం” అనే పుస్తకానికి మీరు రాసిన పరిచయంలో ఒక పేరాగ్రాఫ్ ఇది. దేవులపల్లి పబ్లికేషన్స్ ద్వారా ఆ పుస్తకాన్ని ప్రచురించింది కూడా మీరే. ఒక జిల్లా కేంద్రంలో మామూలు జర్నలిస్టుగా పనిచేస్తున్న మీరు శక్తిమంతుడైన ఒక జిల్లా పోలీస్ అధికారిని ధిక్కరించానని వర్ణించిన వైనంలో ఏ అతిశయోక్తీ లేకపోతే, అది నిజంగా చాలా అభినందనీయం. పాత్రికేయుల హక్కుల కోసం, పత్రికా స్వేచ్ఛ కోసం, పౌర, ప్రజాతంత్ర హక్కుల కోసం మీరు అదరక, బెదరక రాజ్య వ్యవస్థనే ఢీకొట్టానని చెప్పడం నిజంగానే స్ఫూర్తిదాయకం. రాజ్యం ఉక్కుపాదం మోపినవేళ, తీవ్ర నిర్బంధం అమలు చేస్తున్నవేళ, ఒక జర్నలిస్టును ఎన్‌కౌంటర్ చేయడమనేది పెద్ద విషయం కాని వేళ, ముప్పయేళ్ళ కిందట పాత్రికేయుల హక్కుల పరిరక్షణ కోసం మీరు చూపిన తెగువ, నైతిక శక్తిని చూస్తుంటే అబ్బురం కలుగుతోంది. మీరు పౌరహక్కుల పట్ల, పత్రికా స్వేచ్ఛపట్ల త్రికరణశుద్ధిగా నిబద్ధత కలిగి ఉండేవారని, బహుశా ఇప్పటికీ కలిగే ఉన్నారనీ నమ్మకం కలుగుతోంది.

కానీ, మొన్నటి మీ చరిత్రని చూసి అబ్బురపడుతున్న వేళలోనే, నేటికాలంలో జరుగుతున్న సంఘటనలను చూసి విషాదం కూడా కలుగుతోంది. ఇంతటి హక్కుల పోరాటశీలిగా ఉన్న మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా వ్యవహారాల సలహాదారుగా నియమితులయి మూడువారాలు కూడా గడవక ముందే, పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, ప్రభుత్వ శాఖాధిపతులకు కూడా పత్రికల మీద, పాత్రికేయుల మీద పోలీసు కేసులు పెట్టే అధికారాల్ని కట్టబెడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులపట్ల మీ మౌనం, మీరు నోరెత్తని వైనం ఎందుకో పత్రికా స్వేచ్ఛనీ, పాత్రికేయ హక్కుల్ని, ప్రజావాణినీ చూసి వెక్కిరింతగా నవ్వుతున్నట్లు కనబడుతున్నాయి.

మీ స్పందనలేమి చూస్తుంటే గత పదిహేను సంవత్సరాలుగా వైయెస్సార్ కుటుంబానికి రాజకీయ సహచరుడిగా మారిన మీరు, హక్కుల పోరాటపు కాడి కింద పడేశారా లేక కన్వీనియెంట్ సందర్భాల్లో మాత్రమే వాడుతున్నారా అని అనుమానం కలుగుతోంది. ఒక సామాన్య పాత్రికేయుడి రూపంలో, ముప్పయేళ్ళ కిందటనే ఒక ఎస్పీని ధిక్కరించిన మీ స్వరం, ఇవాళ సాక్షాత్తూ ముఖ్యమంత్రికి జాతీయ మీడియా వ్యవహారాల సలహాదారుగా అత్యున్నతమైన పదవిలో ఉండి కూడా ఎందుకు మూగవోయిందనేది శేషప్రశ్నలా మిగిలిపోయింది. ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచనాధోరణి, పత్రికల గొంతు నొక్కే ఉత్తర్వుల జారీ నైతికంగా తప్పనీ, అప్రజాస్వామ్యికమనీ, రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమనీ, పౌర, ప్రజాతంత్ర హక్కులకు శరాఘాతమనీ మీరు ప్రభుత్వానికి కనీసం అంతర్గతంగానైనా సలహా ఇవ్వలేదా, లేక ఇచ్చినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందా అనే శంక కలుగుతోంది. లేదా, అసలు మీరు సలహా ఇవ్వలేనంతగా మిమ్మల్ని ఇబ్బందిపెట్టే పొలిటికల్, ప్రొఫెషనల్ కంపల్షన్స్, సామాన్యులకు గోచరించనివి ఏమైనా ఉన్నాయేమో అన్న అనుమానం కూడా ప్రజల్లో వ్యక్తం అవుతోంది. కన్నబీరన్, బాలగోపాల్, బుర్రా రాములు వంటి మేరుశిఖరాలు నేలకొరిగిన తర్వాత తెలుగునేల మీద హక్కుల ఉద్యమాలు కొడిగట్టిపోయినాయని, ఇప్పుడు మిగిలింది ఆ ఉద్యమాల ముసుగులో రాజకీయ ఉన్నతికి బాటలు వేసుకున్న అవకాశవాదులు, దళారీలు మాత్రమేనని ప్రజలు వింటున్న విమర్శలు నిజమేనేమో అని సందేహం కలుగుతోంది.

ప్రజాస్వామ్య వ్యవస్థల్ని పరిరక్షించడంలో పత్రికల పాత్ర గురించి మీలాంటి సీనియర్ పాత్రికేయులకు నేను వివరించాల్సిన పని లేదు. ‘వార్తయందు వర్ధిల్లు జగము’ అని నన్నయ పలికినా, పత్రిక అంటేనే యాంటి-ఎస్టాబ్లిష్‌మెంట్ అని మీరు పని చేసిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ స్థాపకులు రాంనాథ్ గోయెంకా సూత్రీకరించినా, అన్నిటి సారాంశం ఒకటే. ప్రభుత్వ వ్యవస్థల లోటుపాట్లను, విధానాలను ఎత్తిచూపుతూ ప్రజావాణిని వినిపించడమే పత్రికల ప్రథమ కర్తవ్యం. 130 ఏళ్ళ హిందూ పత్రిక మొదలుకుని, నిన్నటి మీ సాక్షి పత్రికదాకా ఇవే విలువలు పాటిస్తున్నామని ప్రకటించుకుంటున్నాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌లో మీ కొత్తప్రభుత్వం ఏర్పడిన తరువాత, గత మూడునెలల కాలంలో, అకస్మాత్తుగా మీడియా సంస్థలన్నీ తమ వర్గప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఈ పత్రికావిలువలకు తిలోదకాలిచ్చేశాయని మీ ప్రభుత్వం భావిస్తున్నదేమో తెలియదు. మీ ఆలోచన అదే అయిన పక్షంలో, సంస్కరణ మొదలు పెట్టాల్సింది మీ సాక్షి మీడియాహౌస్ నుండే అనే విషయాన్ని కూడా గుర్తెరగమని మనవి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్.

చరిత్ర కొందరిని మాత్రమే అజరామరం చేస్తుంది. తాము ఎంచుకున్న మార్గంలో రాజీలేని పోరాటం సలిపినవారిని, సార్వకాలికమూ, సార్వజనీనమూ అయిన విలువలకు కట్టుబడినవారిని మాత్రమే కాలం వైతాళికులుగా చరిత్రపుటల్లో నిక్షిప్తం చేస్తుంది. నాలుగున్నర దశాబ్దాల మీ పాత్రికేయ వృత్తి విలువలకీ, హక్కుల ఉద్యమ భాగస్వామ్యానికి, నిబద్ధతకీ ఇదొక అగ్నిపరీక్ష. కన్నబీరన్, బాలగోపాల్, బుర్రా రాములు వంటి హక్కుల ఉద్యమ యోధుల సరసన నిలబడగలిగిన నైతిక అర్హత సాధిస్తారో లేక రాజకీయ ఒత్తిళ్ళకు లొంగిపోయిన సవాలక్షమంది పెన్నెముక లేనివారి సరసన చేరుతారో ఇక మీ ఇష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకంగా, పాత్రికేయుల మీద అణచివేత కొనసాగించే విధంగా, భయభ్రాంతుల్ని చేస్తూ, రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన హక్కుల్ని హరిస్తూ వెలువరించిన ఉత్తర్వుల్ని ఖండిస్తూ, ప్రజల పక్షాన, పత్రికల పక్షాన మీరు నిలబడాల్సిన సమయం ఇది. మిగిలిందంతా మీ విజ్ఞతే.

ధన్యవాదాలతో,
కె.సి.చేకూరి
ఆంధ్రప్రదేశ్ పౌరవేదిక.

tolivelugu app download

Filed Under: చెప్పండి బాస్..

Primary Sidebar

ఫిల్మ్ నగర్

పూజా హెగ్డే కి అంత డిమాండ్ ఎందుకో ?

పూజా హెగ్డే కి అంత డిమాండ్ ఎందుకో ?

ఆచార్య నుంచి మరో అప్డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్ ?

ఆచార్య నుంచి మరో అప్డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్ ?

ఆస్కార్ బరిలో ఆకాశం నీ హద్దురా !!

ఆస్కార్ బరిలో ఆకాశం నీ హద్దురా !!

తెర‌పైకి మ‌నం-2?

తెర‌పైకి మ‌నం-2?

చిరంజీవితో ప్రదీప్ మాచిరాజును ను పోల్చడం సరియేనా ?

చిరంజీవితో ప్రదీప్ మాచిరాజును ను పోల్చడం సరియేనా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

father mother

మ‌ద‌న‌ప‌ల్లె కూతుళ్ల హ‌త్య కేసులో సంచ‌ల‌న విష‌యాలు

రైత‌న్న పార్ల‌మెంట్ ర్యాలీ వాయిదా...?

రైత‌న్న పార్ల‌మెంట్ ర్యాలీ వాయిదా…?

ఫిబ్రవరి 18న‌ ఐపీఎల్ వేలం

ఫిబ్రవరి 18న‌ ఐపీఎల్ వేలం

రాజ‌కీయాల్లోకి చిరంజీవి రీఏంట్రీ- ఇదిగో సాక్ష్యం

రాజ‌కీయాల్లోకి చిరంజీవి రీఏంట్రీ- ఇదిగో సాక్ష్యం

బాంబే హైకోర్టు వివాదాస్పద తీర్పుపై సుప్రీం స్టే

బాంబే హైకోర్టు వివాదాస్పద తీర్పుపై సుప్రీం స్టే

బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీకి మ‌రోసారి గుండెపోటు

బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీకి మ‌రోసారి గుండెపోటు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)