డియర్ కామ్రేడ్ - Tolivelugu

డియర్ కామ్రేడ్

common man poetry on kcr and his rule, డియర్ కామ్రేడ్

దొరా….!
కాలుతున్న కట్టెలమీద కార్మికుని కాయం చిటపట మని మండుతుంటే
పకపకమని నవ్వుతుండ్రు నువ్వు, నీ రాక్షస సమూహం …జర జాగ్రత్త దొరా…!

ఆగని గడియారపు ముల్లోలే ….
ఘడియకో గుండె ఆగుతోంది, పూటకో శవం లేస్తోంది.
ఇంకెన్ని గుండెలు ఆగాలి దొరా…! నీకు ఇంకెన్ని శవాలు కావాలి మా దొరా…!

దొరా……!
నాడు మాపాదాన ముల్లును పంటితో తీస్తానన్నావు,
నేడు గునపం అందుకొని మాగుండెలో గుచ్చుతున్నావు.

నాడు కాపలా కుక్కలాగా ఉంటానన్నావు.
నేడు పిచ్చి కుక్కవై కరుస్తున్నావు.
అహంకార మదంతో ఖాకీల అండచూసుకొని కట్లపామువై మమ్ముల తరుముతున్నావు.

నీ ఖాకీల లాఠీలు, వారి తూటాలు, ఈ పోరుతెలంగాణా బిడ్డలకు కొత్తేమీ కాదు దొరా…!

జర యాది చేసుకో దొరా…!
నీలాగే విర్రవీగే వారినేందరినో బొందపెట్టింది ఈ తెలంగాణ గడ్డ…

దొరా….!
మా గోసను నీయాసతో, నీ భాషతో గేలి చేస్తున్నావు,
తుపాకిరాముడులా వెకిలి చేష్టలు చేస్తున్నావు…

బిడ్డా జర జాగ్రత్తా…!

పక్కోడి కడుపు మంటను చూసి నీ పాలేరుగాళ్ళు పగలబడి నవ్వుతున్నారు,
దొరా…! వారి నవ్వులు కలకాలం ఉండవు జర రాసి పెట్టుకొ దొరా….!

ఆపదలో ఉన్నప్పుడు అన్యాయం జర్గినప్పుడు…
వాళ్ళ కళంతో, వాళ్ళ గళంతో, వాళ్ల కాలి గజ్జలతో పొద్దును సైతం పొడిపించిన..
నా తెలంగాణ కలాలు, గళాలు, గజ్జెలు ఎమాయే ఎటుపాయే?
ఏ ఒక్కడి కలంనుండి, ఏ ఒక్కడి గళం నుండి…
ఆగుతున్న ఆర్టీసీ గుండెల గురించి ఏ ఒక్క అక్షరం బయటకు రాదే?
ఏ ఒక్క గళం స్వరాన్ని సరిచేయదే…?
ఆ కలాలు ఎటుపాయే…? ఆ గళాలు ఏమాయే…..?
నీ ఎంగిలి మెతుకులను ఎరగావేసి, పదవులను ఆశగా జూపి….?
నీ దొడ్లో కుక్కలవోలే కట్టేసు కున్నావా దొరా…..!

అయినా పర్వాలేదు దొరా….!

సమస్త కార్మిక – కర్షక , ఉద్యోగ – ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన, సమస్త రాజకీయ పక్షాలు మాకు వెన్నుదన్నుగా ఉన్నాయి దొరా….!

దొరా….!
బంగారు తెలంగాణా అన్నావు,
బ్రతుకు లేకుండా చేసావు,
మిగులు రాష్ట్రం అన్నావు, మింగమెతుకు లేకుండా చేసావు,
పండుగల పూట మా పిల్లాపాపలను పస్తులే ఉంచావు….!

దొరా….!
నీళ్ళు, నిధులు అన్నావు, కాళేశ్వరం కమీషన్ల కు కక్కుర్తి పడ్డావు,
నియామకాలు అన్నావు నిరుద్యోగులను నట్టేట ముంచావు,
ఉస్మానియా బిడ్డల ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుంది దొరా…..!

నువ్వు రారాజుననుకుంటున్నావు, నియంతల వ్యవహరిస్తున్నావు,
నీ పతనాన్ని నువ్వే కొనితెచ్చుకొంటున్నావు…!
జర జాగ్రత్త దొరా….!

60 మంది ప్రయాణికులు ఆగమైపోయినా ఉలకవు,
20 మంది బాలలు సమిదలైపోయినా పలకవు,
పసిప్రాణాలు గాలిలో కలిసినా చలించవు…..
నువ్వేమి దొరవి ? నువ్వెక్కడి దొరవి..? ఆఘోరాకి మరో రూపం నువ్వు!
నిన్ను నమ్మాo దొరా…! మోసం చేశావ్ దొరా….! మేము మోసపోయాం దొరా….!

1200 మంది విద్యార్థుల శవాలమీద నుండి నడచి పీఠమెక్కావ్ దొరా…!
వారి బలిదానమే నీ పాలిట బలిపీఠం అవుతుంది దొరా……!

ఇది ఆర్టీసీ పోరాటం కాదు, ఇది ఆకలి పోరాటం అంతకన్నా కాదు, ఒక మేకవన్నిన పులిని, రెండునాల్కల పాముని, బాహ్యప్రపంచానికి పరిచయం చేసిన ఒక యుద్ధం దొరా….!

దొరా……!
తెలంగాణలో తొలిఉద్యమం అయ్యింది …
తెలంగాణలో మలి ఉద్యమం ముగిసింది….
కానీ, దొరా…! తెలంగాణలో ఈ ఆఖరి ఉద్యమం నీ అంతానికే దొరా…!

దొరా …….!
కార్మికుల కళ్ళు ఎర్రబడుతున్నాయి గుండెలు మండుతున్నాయి. అందులోనుంచి వచ్చేవి కన్నీరనుకుంటే పొరబాటే .. గుర్తుంచుకో దొరా…! మండుతున్న కార్మికుని గుండె అగ్నిపర్వతం లాంటిది…!
అది దావానలంలా నిన్ను నీ సామ్రాజ్యాన్ని మాడిమసి చేస్తుంది.. ఖబడ్దార్ దొరా…!!!

ఆర్టీసీ కార్మికులారా..!, చెల్లెలారా..!
🙏దయచేసి మీరేవరూ ఆత్మహత్యలు చేసుకొని తనువు చాలించవద్దు. మనం పిరికివారము కాము, అవసరం అయితే యుద్ధంలో బరిగీసి పోరాడి ప్రాణాలు పోగొట్టుకుందాం!
ఇలాకాదు… తెగించి పోరాడుదాం….!
ఈ దొరా ఏందో వీడి పీకుడేందో చూసుకుందాం….!

✊✊✊విప్లవాభివందనాలతో….

మీ.. కామ్రేడ్!

Share on facebook
Share on twitter
Share on whatsapp