ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఎన్నో రకాల మోటార్ సైకిళ్లను తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. కొన్ని కంపెనీలకు చెందిన బైక్‌లు మన దేశంలోనూ లభిస్తున్నాయి. అయితే ఒకప్పుడు రాజ్యమేలిన అనేక కంపెనీలకు చెందిన బైక్‌లు ఇప్పుడు మార్కెట్‌లోకి రావడం లేదు. అలాంటి బైక్‌లను తయారు చేసిన కొన్ని కంపెనీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రఫ్:
బ్రిటన్‌కు చెందిన ఈ కంపెనీ అత్యంత నాణ్యమైన, ఖరీదైన మోటార్ సైకిళ్లను తయారు చేసేది. ఒక దశలో ఈ కంపెనీకి చెందిన మోటార్ సైకిళ్లను రోల్స్ రాయ్స్ మోటార్ సైకిల్స్ అని పిలిచేవారు. అంటే కార్లలో రోల్స్ రాయ్స్ ఎలా ఫేమసో బైక్‌లలో ఈ కంపెనీ అలాగే ఫేమస్‌గా ఉండేది. ఒక్కో మోటార్ సైకిల్‌ను యంత్రాలతో కాకుండా చేతుల్తోనే బిగించేవారు. అందువల్ల ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా పర్‌ఫెక్ట్‌గా బైక్‌లను ఈ కంపెనీ తయారు చేసేది. ఇక ఈ కంపెనీకి చెందిన సుపీరియర్ ఎస్ఎస్-100 అనే మోడల్‌ను అప్పట్లో సర్ లారెన్స్ ఆఫ్ అరేబియా నడిపేవారు. ఈ కంపెనీకి చెందిన మొత్తం 3 మోటార్ సైకిళ్లను కొన్నారు. కానీ ఒక మోటార్ సైకిల్‌ను నడుపుతూ చనిపోయారు.
ది విన్సెంట్ (హెచ్ఆర్‌డీ విన్సెంట్):
ఈ కంపెనీ అప్పట్లోనే అత్యంత వేగవంతమైన టెక్నాలజీ పరంగా అధునాతనమైన స్పోర్ట్స్ మోటార్ సైకిల్స్ ను తయారు చేసేది. వాటిల్లో డ్యుయల్ ఫ్రంట్ బ్రేక్స్, కాంటిలివర్ రియర్ సస్పెన్షన్ వంటి సదుపాయాలు ఉండేవి. ఇక ఈ కంపెనీ కూడా బిట్రన్‌కు చెందినదే. 1950లలోనే గంటకు 150 మైళ్ల వేగంతో వెళ్లే బైక్‌లను తయారు చేసింది. ఈ బైక్‌లు వేగంగా వెళ్లడమే కాకుండా.. వీటిని బాగా కంట్రోల్ చేయవచ్చేది. ఈ రెండు అంశాలకే అప్పట్లో ఇవి ఫేమస్ అయ్యాయి.
క్రాకర్:
ఇది అమెరికా కంపెనీ. ఈ కంపెనీకి చెందిన బైక్‌లు ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు. వీటిని కూడా యంత్రాలతో కాకుండా చేతుల్తోనే అప్పట్లో బిగించేవారు. అందువల్ల పర్‌ఫెక్ట్ క్వాలిటీని ఇవి కలిగి ఉండేవి. ఫిట్టింగ్, ఫినిషింగ్, ఇంజినీరింగ్ పరంగా ఈ బైక్‌లు అద్భుతంగా ఉండేవి. అలాగే అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చేవి.