పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా నిర్మిస్తున్న ఉదండపూర్ జలాశయంలో ముంపునకు గురవుతున్న ఇళ్లకు పరిహారం చెల్లించే విషయంలో చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి. పరిహారం అంచనాల్లో హెచ్చు,తగ్గులు,అవకతవకలు జరిగాయని గతంలో ఆరోపణలు రాగా,ప్రస్తుతం తండాల్లో ఇళ్లకు పరిహారం విషయంలో స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటి నిర్మాణాలతో పాట వాకిళ్లకు, ఖాళీ స్థలాలకు సైతం పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఎంత స్థలమున్నా 250 గజాలకే పరిహారం చెల్లించేలా అంచనాలు రూపొందించారని ఆరోపిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మరోసారి సర్వే నిర్వహించారు.
తాజాగా తండాల్లో ఉన్న ఇళ్లకు పరిహారం విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వద్ద జలాశయాన్ని నిర్మిస్తున్నారు. ఈ జలాశయం కింద ఉదండపూర్,వల్లూరు గ్రామాలు సహా అనుబంధంగా ఉన్న తుమ్మలకుంట తండా, రేగడిపట్టి తండా, ఒండిగట్టు తండా, శామగడ్డ తండా,చిన్న గుట్ట తండాలున్నాయి.
ఈ తండాల్లోని ఇళ్లకు పరిహారం అంచనా విషయంలో అధికారులు తమ ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తండావాసులు ఆరోపిస్తున్నారు. ఇంటి నిర్మాణంతో పాటు వాకిలి సహా ఖాళీ స్థలాలకు సైతం పరిహారం రావాలని నిర్వాసితులు కోరుతున్నారు. వ్యవసాయ భూములకు ఎకరాకు ఐదు లక్షలిస్తే, ఆ పరిహారం ఏ మాత్రం సరిపోలేదని, ఇప్పుడు ఇళ్ల స్థలాల విషయంలోనూ నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.