ఆదివారం నాడు జరిగిన నీట్ పరీక్షకు హాజరయ్యే సమయంలో విద్యార్థినుల పట్ల పరీక్షా కేంద్రం వద్ద ఉన్న అధికారులు చాలా దారుణంగా ప్రవర్తించరని,మాతో లోదుస్తులు విప్పించారంటూ ఓ విద్యార్ధిని తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వాధికారులు ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాసింది. కొల్లామ్ జిల్లాలోని అయూర్‌లో ఓ ప్రైవేట్ కాలేజీలో.. నీట్ పరీక్షలకు హాజరైన విద్యార్థినుల పట్ల తనిఖీల పేరుతో అక్కడ సిబ్బంది అవమానకరంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి.
డ్రెస్‌కోడ్ అని చెప్పి విద్యార్థినుల లోదుస్తులు విప్పించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఓ విద్యార్థిని తండ్రి దీనిపై మీడియా ఎదుట తన ఆవేదన వ్యక్తం చేయటం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డ్రెస్ కోడ్ నిబంధనల మేరకు దుస్తులు ధరించినప్పటికీ.. సిబ్బంది అవమానకరంగా వ్యవహరించారని ఆయన వాపోయారు. ఈ ఘటనను ఖండిస్తూ వివిధ విద్యార్థి సంస్థలు ఆందోళన చేపట్టాయి.
ఘటనకు కారణమైనవారిని.. అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ అంశమై ఓ విద్యార్థిని చేసిన ఫిర్యాదు మేరకు.. ఐపీసీ 354,509 సెక్షన్ల కింద కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థిని వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఘటనకు కారణమైన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.మరోవైపు.. డ్రెస్‌కోడ్ పేరిట లోదుస్తులు విప్పించారంటూ చేసిన ఫిర్యాదు అవాస్తమని జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) తెలిపింది. దురుద్దేశంతో చేసిన ఫిర్యాదుగా పేర్కొంది.
ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేసింది. మీడియా కథనాల ఆధారంగా పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్, అబ్జర్వర్‌ను నివేదిక కోరామన్న అధికారులు..ఈ తరహా ఘటనలు ఏవీ జరగలేదని వారు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. విద్యార్థిని దురుద్దేశంతో ఫిర్యాదు చేసినట్లు పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ తెలిపినట్లు వెల్లడించారు. విద్యార్థిని తండ్రి ఆరోపించినట్లు అలాంటి కార్యకలాపాలను నీట్ డ్రెస్ కోడ్ అనుమతించదని ఎన్టీఏ స్పష్టం చేసింది.
ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలంటూ కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి బిందు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. ఇలాంటి ఘటనలు జరగడం అవమానకరమని.. ఈ చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని లేఖలో పేర్కొన్నారు.