సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నెలకొంది. భట్టు రాజు జాతిని అవమానించేలా మాట్లాడిన పాటల రచయిత అనంత శ్రీరామ్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర భట్ట రాజ సంఘం సభ్యులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు.
అనంత శ్రీరామ్ ఓ యూట్యూట్ వీడియోలో భట్టు రాజు జాతిని కించపరిచేలా మాట్లాడటంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ రక్షణలో భట్టుజాతి సైన్యం కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఈ వీడియోకు సంబంధించిన లింక్ ను పోలీసులకు అందజేశారు.
అనంత్ శ్రీరామ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే త్రిపురనేని చిట్టిబాబు కూడా భట్టురాజు జాతిని కించపరిచేలా వ్యాఖ్యానించారని మరో ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇటీవల పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న అనంత్ శ్రీరామ్ సరదాగా మాట్లాడుతూ.. ‘భట్రాజు పొగడ్తలు’ అనే పదాన్ని వినియోగించాడు. వాస్తవానికి ‘భట్రాజు పొగడ్తలు’ పదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది.