జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి భూ వివాదంలో చిక్కుకున్నారు. గతంలో జనగామ చెరువు స్థలాన్ని ఆక్రమించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ముత్తిరెడ్డి.. తాజాగా చేర్యాలలో చెరువు మత్తడి కింద ఉన్న స్థలాన్ని ఆక్రమించారనే ఫిర్యాదు వచ్చింది. నకిలీ పత్రాలతో రూ.8 కోట్ల విలువైన 2,540 గజాల స్థలాన్ని ముత్తిరెడ్డి ఆక్రమించారంటూ ఈ మేరకు సిద్దిపేట జిల్లా అఖిలపక్ష నాయకులు ఆధారాలు చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో లోకాయుక్తకు కూడా వారు కంప్లెయింట్ చేశారు
చేర్యాలలో పెద్ద చెరువు మత్తడి కింద ఉన్న స్థలాన్ని ఆక్రమించిన ఎమ్మెల్యే.. ఆ భూమిని తన కూతురు, అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అఖిల పక్ష నేతలు చెప్తున్నారు. చెరువు జాగాలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని చూస్తున్నట్టు వారు ఆరోపిస్తున్నారు.ఒకవేళ అదే జరిగితే భారీ వర్షాలతో చేర్యాల చెరువు మునిగిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఎమ్మెల్యేకే వత్తాసు పలుకుతున్నారని వారు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.