గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న అభియోగాలతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై ఎస్సార్ నగర్ పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో వీరు చేసిన వ్యాఖ్యలు సామాజిక ఘర్షణలకు తావిచ్చేలా ఉన్నాయని.. సుమోటోగా కేసులు నమోదు చేశారు.
గత మంగళవారంఎర్రగడ్డలోని సుల్తాన్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అక్బరుద్దీన్ ఒవైసీ.. హుస్సేన్‌సాగర్‌ను ఆక్రమిస్తూ పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను నిర్మించారని.. దమ్ముంటే ప్రభుత్వం వాటిని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందనగా బండి సంజయ్ ఆ మరుసటి రోజు బల్కంపేటలో ఎన్నికల ప్రచారంలో కౌంటర్ ఇచ్చారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చితే.. రెండు గంటల్లో బీజేపీ కార్యకర్తలు దారుస్సలాంను కూల్చివేస్తారంటూ కామెంట్ చేశారు. ఇరువురు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇద్దరి వ్యాఖ్యలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించిన పోలీసులు… కేసులు నమోదు చేశారు.