చేసేవేమో దౌర్జన్యాలు.. వాటిపై ప్రశ్నిస్తేనేమో కేసులు.. ఇదీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరు. తమ అక్రమాలను నిలదీసిన స్థానికులపైనే కేసులు పెట్టి.. అధికార పార్టీ నేతలు చర్చనీయాంశంగా మారారు. పోలీసులు కూడా అక్రమాలు చేసే వారిని వదిలేసి.. బాధితులపైనే కేసులు పెడుతూ వచ్చారు. దీంతో ఆ కార్పొరేటర్లు, పోలీసుల ఆగడాలు తట్టుకోలేక చివరికి నిజాంపేట వాసులు జాతీయ ఓబీసీ కమిషన్‌ను ఆశ్రయించారు.
బాచుపల్లిలోని మా విల్లాస్‌కు ఓ పార్కు స్థలం ఉంది. నెల 8న స్థానికులు, బీజేపీ నేతలతో కలిసి “స్వచ్ఛ భారత్” కార్యక్రమం నిర్వహించారు. పార్కును శుభ్రం చేసి, మొక్కలు నాటారు. అయితే అది సహించలేని అధికార పార్టీ కార్పొరేటర్లు తెరమీదకు వచ్చారు. ఆ స్థలం తనదేనంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు, బీజేపీ నేతలు అక్రమంగా ఆ స్థలాన్ని చదును చేస్తున్నారని కంప్లెయింట్ ఇచ్చాడు. పోలీసులు కూడా ముందూ వెనకా చూడకుండానే 10 మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో బాధితులు జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారిని కలిసి ఫిర్యాదు చేశారు.
పార్కు స్థలం మా విల్లాస్ కాలనీకే చెందిందని ఆయనకు వివరించారు. కబ్జాకు గురయ్యే అవకాశం ఉండటంతో మొక్కలు నాటితే.. ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో బాచుపల్లి పోలీసులు తమపై అక్రమ కేసు నమోదు చేశారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారి ఫిర్యాదును స్వీకరించిన ఓబీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి .. పార్క్ స్థలం, కేసు నమోదు విషయాలపై పూర్తి నివేదిక తెప్పించుకుంటానని.. ప్రజలకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.