జీవిత భాగస్వామి బదిలీల కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న తెలంగాణ ఉపాధ్యాయులను అరెస్టు చేయడంపై జాతీయ మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. ఉపాధ్యాయ కుటుంబాల తరఫున కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈ ఫిర్యాదు చేశారు.
రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ డిసెంబర్ 2021లో జరిగింది. దీనిలో భార్యాభర్తలుగా ఉన్న ఉపాధ్యాయులకు వారికి నచ్చిన జిల్లాల్లో పోస్టులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్క్యులర్ మెమో నంబర్ 1655 ప్రకారం ముందుగా భార్యాభర్తలైన ఉపాధ్యాయులకు పోస్టులు కేటాయించాలని జీవోలో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని కేవలం 19 జిల్లాల్లో మాత్రమే ఈ ఉత్తర్వులను అనుసరించారు. కానీ మిగిలిన 13 జిల్లాల్లో వీటిని పాటించలేదు. దీంతో ఉపాధ్యాయ దంపతులకు వేర్వేరు జిల్లాల్లో పోస్టింగులు వచ్చాయి. దీంతో ఉపాధ్యాయ దంపతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతేడాది కేటాయింపులు జరగ్గా వాటిలో జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని స్పౌజ్ ఫోరమ్ డిమాండ్ చేస్తోంది.
కానీ ప్రభుత్వం వారి డిమాండ్లను పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఉపాధ్యాయ దంపతులకు అదే జిల్లాలో పోస్టులు కేటాయించాలంటూ తెలంగాణ స్పౌజ్ ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు నిన్న పాఠశాల విద్యా డైరెక్టరేట్ ఎదుట మౌన నిరసన చేపట్టారు. శాంతి యుతంగా దీక్ష సమయంలో ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు.