ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సంచలన విషయం వెలుగుచూసింది. ఓయూ నకిలీ సర్టిఫికెట్లతో కొందరు విదేశాలకు వెళ్తున్నట్లు బయటపడింది. దీనిపై నగర సీపీకి ఫిర్యాదు చేశారు విద్యార్థి నాయకులు.
ముద్దం స్వామి అనే వ్యక్తి ఉస్మానియా నకిలీ సర్టిఫికెట్లతో అమెరికాలో చదువుతున్నట్లు సీపీకి వివరించారు విద్యార్థులు. దీన్ని ఓయూ అధికారులు సైతం ధృవీకరించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కన్సల్టేషన్, ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూట్స్ అడ్డాగా ఈ దందా సాగుతోందని సీపీకి వివరించారు విద్యార్థి నాయకులు. ఫిర్యాదుతోపాటు తగిన ఆధారాలను కూడా అందజేశారు. ఇలా ఎంతో మంది నకిలీ సర్టిఫికెట్ పొందారో సమగ్ర విచారణ జరపాలని కోరారు.
పలువురు ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్లారని ఉస్మానియా విద్యార్థి నాయకుడు శరత్ నాయక్ అన్నారు. ఈ వ్యవహారం వెనుక అధికారుల పాత్రపైనా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని… ముద్దం స్వామిని పది రోజుల్లో అదుపులోకి తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చినట్లు వివరించారు.