–నారాయణ పేట జిల్లాలో అక్రమ ఇసుక రవాణ
–పట్టించుకోని రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు
–లక్షల్లో ముడుపులు ముడుతున్నాయని ఆరోపణలు
–అరికట్టాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త
నారాయణపేట జిల్లాలో మళ్లీ ఇసుక మాఫియా మొదలైంది. అక్రమంగా ఇసుకను తరలిస్తూ దళారులు రెచ్చిపోతున్నారు. దానిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్. ఇసుక మాఫియాను అడ్డుకొని, మాఫియాపై పిడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ హరిచందనలకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని అన్నారు. జిల్లా పరిధిలోని రాకొండ, మరికల్, మక్తల్, నేరడ్గం, వర్కుర్, చిత్తనుర్, మగనూర్, మద్దూర్, లింగల్చేడ్, గోటూర్, పూసల్పాడ్, ఊట్కూరు తదితర మండలాల్లోని.. పెద్దవాగు, మన్నేవాగు, బిజ్జరంవాగు, లింగల్చేడువాగు వాగుల నుంచి రాత్రి, పగలు అని తేడా లేకుండా ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని అన్నారు.
కొందరు పోలీస్, రెవెన్యూ అధికారులకు లక్షల్లో ముడుపులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నెల 10న దేవర్ కద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో మక్తల్ నుండి 42 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులు పట్టుకకొని స్థానిక పోలీసులకు అప్పగించారని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్ విజిలెన్స్ పోలీసులకు కనిపించే ఇసుక మాఫియా లారీలు.. నారాయణపేట పోలీసులకు, రెవిన్యూ, మైనింగ్ అధికారులకు ఎందుకు కనిపించడంలేదని ప్రవీణ్ ప్రశ్నించారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ.. జిల్లాలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ.. కోట్లాది రూపాయల ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇసుక మాఫియాపై వెంటనే చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు ప్రవీణ్. మాఫియాపై పిడీ యాక్ట్ కింద కేసులు నమోదు చెయ్యాలని కోరారు. ఇసుక మాఫియాకు సహకరిస్తున్న సంబంధిత పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
తన ఫిర్యాదుపై నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు సానుకూలంగా స్పందించారని తెలిపారు. జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అంతేకాకుండా ఇసుక మాఫియాకు అడ్డాగా మారిన రాకొండ ఉకచెట్టు వాగు నుండి ఒక్క లారీ ఇసుకను మహబూబ్ నగర్ జిల్లాకు, హైదరాబాద్ కు తరలించకుండా రాబోయే 15 రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని ప్రవీణ్ తెలిపారు.