– సిద్దిపేట బీజేపీ నేత సైబర్ చీటింగ్స్
– ఈజీ జాబ్స్ పేరుతో మోసాలు
– చీటింగ్ సొమ్ముతో సేవ అంటూ కలరింగ్
– వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు
– అరెస్ట్ నేపథ్యంలో తెరపైకి బాధితులు
– ఉద్యోగ గాలంతో జీవితాలతో చెలగాటం
– సమయం, డబ్బు నష్టపోయిన యువత
– బీజేపీలో చేర్చుకుంది ఈ మహా మోసగాడినా?
– ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు
– తవ్వేకొద్దీ బయట పడుతున్న చక్రధర్ గౌడ్ మోసాలు?
క్రైంబ్యూరో, తొలివెలుగు: ఉద్యోగాల కోసం యువత కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. ఒక్క ఉద్యోగం దొరికితే కుటుంబాన్ని పోషించుకోవచ్చని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే, ఆస్తులు అమ్మి, అప్పులు తెచ్చి మరీ ట్రైనింగ్ తీసుకుంటారు. అలాంటి యువత జీవితాలతో సిద్దిపేట బీజేపీ నేత చక్రధర్ గౌడ్, ఆయన స్నేహితురాలు చేరెడ్డి ఆరోషికా రెడ్డి చెలగాటం ఆడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ ఆశను ఆసరాగా చేసుకుని ఈజీ జాబ్స్ పేరిట మోసం చేశారని చక్రధర్ బాధితులు ఆరోపిస్తున్నారు. అతని బారినపడి తాము ఎలా మోసపోయామో వినియోగదారుల ఫోరానికి ఆన్ లైన్‌లో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.
మహా కేటుగాళ్లు!
కళ్లు మూసి తెరిచే లోపే సైబర్ మోసగాళ్లు అకౌంట్ ఖాళీ చేస్తున్నారు. ఓటీపీ పేరుతో ఫోన్ పే లాంటి యూపీఐ పేమెంట్లతో క్షణాల్లో చీటింగ్ చేసేస్తున్నారు. అయితే.. చక్రధర్ మాత్రం నెల రోజులు పని అంటూ భారీ జీతం ఆశ చూపించి డబ్బులు లాగేస్తాడని బాధితులు చెబుతున్నారు. మొదట రూ.50 వేల జీతం చెప్పి డేటా ఎంట్రీ పని చేయించుకుంటాడని అంటున్నారు. ఆ తర్వాత బ్యాంకు అకౌంట్‌లో జీతం యాడ్ కావాలంటే డబ్బులు చెల్లించాలని బ్లాక్ మెయిల్ చేస్తాడని వాపోతున్నారు. పోతేపోనీ రూ.5వేలు పోయినా రూ.50 వేల జీతం యాడ్ అవుతుందని అనుకుని తామంతా డబ్బులు చెల్లించినట్టు చెబుతున్నారు. అలా ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేశారని, ఆ తర్వాత నుంచి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యమున అనే యువతి తాను ఎలా మోసపోయానో వివరిస్తూ ఫిర్యాదు చేసిన పత్రాన్ని (https://www.mycomplaintonline.com/i-have-lost-money) చదివితే చక్రధర్ గౌడ్ ఎలాంటి మోసాలు చేసి సంపాదిస్తున్నాడో అర్థం అవుతుందని అంటున్నారు. తనను కూడా ఇలాగే మోసం చేశారంటూ మరో బాధితుడు అజయ్ మరిన్ని వివరాల్ని వెల్లడించాడు. రెండేళ్ల క్రితమే ఈ మోసాల గురించి తాను సోషల్ మీడియాలో షేర్ చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు. అతను తాను మోసపోయిన తీరును (https://www.consumercomplaints.in/human-resource-dept-outsourcing-patnerhrdop-provided-a-work-from-home-job-and-took-some-amount-and-defrauded-us-c2730155) సోషల్ మీడియాలో వివరించాడు. ఇప్పుడు చక్రధర్ అరెస్ట్ కావడంతో తమ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఇప్పించాలని వేడుకుంటున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని మళ్లీ పోలీసులను సంప్రదిస్తున్నారు. మరికొందరు బాధితులు జ్యోతి, నిఖిత, శైలేష్, బాలాజీ, ఝాన్సీ, నిహారికలు ఇప్పటి వరకు తాము చెల్లించిన పేమెంట్స్ వివరాలను సోషల్ మీడియా ద్వారా వివరించారు.
2021లోనే ఫిర్యాదులు.. మేనేజ్ చేసిన చీటింగ్ గ్యాంగ్!
మరో బాధితురాలు కొల్లి పావని 2021లో వినియోగదారుల ఫోరంలో (https://consumercomplaintscourt.com/internet-services-53/)ఫిర్యాదు చేసింది. వందల మందికి కాల్ సెంటర్ లో జాబ్స్ ఇస్తామని చెప్పి డేటా ఎంటర్ చేయాల్సిందిగా వారికి పీడీఎఫ్ ఫైల్స్ పంపిస్తారని తెలిపింది. ఆరోషికా రెడ్డి మాయమాటలతో మోసం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. నెదర్లాండ్స్ ప్రాజెక్ట్ వైజాగ్, చెన్నైలో ఉందని చెబుతున్నారని తెలిపింది. ఇలా ఎంతోమంది మోసపోయారని చక్రధర్, అతని స్నేహితుల అక్రమాలపై (https://www.complaintlists.com/ezejobs-data-entry-image-to-pdf/) ఫిర్యాదుల్లో వివరించారు బాధితులు.