సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని తెలంగాణ రాష్ట్రంలోని భారత సైన్యానికి చెందిన మాజీ సైనికులు నిరసనకు దిగారు. ఇందిరాపార్కు ఎదుట ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 33 జిల్లాలకు చెందిన మాజీ సైనికులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో 10 డిమాండ్స్ ను వెల్లడించారు. ఎక్స్ సర్వీస్ మెన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు, అన్ని కార్పొరేషన్ లలో రిజర్వేషన్ పెంపు, అప్లికేషన్ రుసుము మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు 5 ఎకరాల అసైన్డ్ భూమి కేటాయింపు, జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న లే అవుట్స్ లలో 175 గజాల ఓపెన్ ప్లాట్ కేటాయించాలని అన్నారు.
సిద్ధిపేట జిల్లాలో సైనిక కమ్యూనిటీ హాల్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లాగా జిల్లా కమిషనరేట్ లో కూడా మాజీ సైనికులను ఎస్పీఓలుగా నియమించాలని కోరారు. మరో వైపు జిల్లాలో ఈసీ హెచ్ ఎస్ సర్వీసుల విస్తరణ, సిద్ది పేట జిల్లాలో క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్, సరుకుల పై ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ చేశారు.
జిల్లా సైనిక సంక్షేమ బోర్డులో మాజీ సైనికుల నియామకం చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న సిక్స్ మెన్ కమిటీ రద్దు చేసి నూతన కమిటీ ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు డిమాండ్ చేస్తున్నారు.