సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. స్మశానవాటిక వద్ద ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నినాదాలు చేశారు.
ఈ విషయంపై మంత్రి తలసాని శ్రీనివాస్ పోలీస్ అధికారులతో మాట్లాడారు. అనంతరం స్మశాన వాటిక నుంచి తలసాని, మల్లారెడ్డి వెళ్లిపోయారు. అయితే.. నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి అధికారికంగా నిర్వహించడంపై ప్రభుత్వ ఉత్తర్వులు లేవని తెలిపారు.
ఎమ్మెల్యే సాయన్న కుటుంబ సభ్యులతో మాట్లాడిన పోలీసులు.. ఉత్తర్వులకు సమయం పడుతుందని వివరించారు. దీంతో అంత్యక్రియలకు సహకరించాలని అభిమానులను కుటుంబ సభ్యులు కోరారు. వారు ఆందోళన విరమించడంతో సాయన్న అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. సాయన్న ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు.
ఇప్పటివరకూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ చనిపోయారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు.