2023లో ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కీసర వేదికగా చింతన్ శిబిర్ కార్యక్రామాన్ని నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలోని సమస్యలు, అధికార పార్టీ ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై చర్చించారు. దీంతో పాటు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ, సంస్థాగత, రైతులు, యువత.. ఇలా ఆరు కమిటీలను ఏర్పాటు చేసుకుని తెలంగాణ సమస్యలపై చర్చించారు.
అందులో భాగంగానే బుధవారం, గురువారం రెండు రోజులు చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహించారు. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ తీర్మాణం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో చేర్చుకోవద్దని కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఫిరాయించిన వారిని కాంగ్రెస్ ద్రోహులుగా రాష్ట్రం అంతా ప్రచారం చేయాలని.. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చే వారికి టికెట్లు ఇవ్వకూడదని కీలక తీర్మాణాలు చేసింది.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వరంగల్ కు వచ్చిన రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ను ప్రకటించారు. ఈ డిక్లరేషన్ ను తెలంగాణలోని అన్ని గ్రామాల్లోకి చేరేలా, రైతులకు వివరించేలా ‘రచ్చ బండ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
అంతేకాకుండా గతంలో ఉన్నట్టు అసమ్మతి ప్రస్తుతం కనిపించట్లేదు. రాహుల్ గాంధీతో తెలంగాణ నేతలు సమావేశం అయిన సందర్భంలో పార్టీలో అసమ్మతిని పక్కన పెట్టి తెలంగాణలో గెలుపు కోసం ప్రయత్నించాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ కు మేమే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ చెప్తోంది. దీంతో.. రాష్ట్రంలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోందనే చర్చ జోరందుకుంది.