కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ రోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ఆయన్ని అధికారులు విచారించారు. సుమారు 4.30 గంటలపాటు ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ…
వాస్తవాన్ని కాకుండా వ్యక్తిని టార్గెట్ చేసుకుని విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. వాస్తవాల లక్ష్యంగా సీబీఐ విచారణ జరగడం లేదని తెలిపారు. మీడియా ప్రభావం వల్లే దర్యాప్తుపై ప్రభావం పడుతోందన్నారు. సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు.
మరోసారి విచారణకు రావాలని తనకు సీబీఐ అధికారులు చెప్పలేదని వెల్లడించారు. తనకు తెలిసిన వాస్తవాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చానన్నారు. దానిపై కూలంకషంగా విచారణ జరపాలని కోరానన్నారు. గూగుల్ టేక్‌అవుటా?టీడీపీ టేక్ అవుటా అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు.
తాను దుబాయికి వెళ్లినట్లు తప్పుడు ప్రచారం చేశారన్నారు. విజయమ్మ వద్దకు తాను వెళ్లినపుడు బెదిరించి వచ్చానని ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు. దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
సీబీఐ అఫిడవిట్ అంశాలను టీడీపీ నేతలు ఏడాదిగా విమర్శిస్తున్నారన్నారు. ఏడాదిక్రితం టీడీపీ చేసిన ఆరోపణలే సీబీఐ కౌంటర్‌లో లేవనెత్తడం సందేహం కలుగుతోందన్నారు. వివేకా చనిపోయిన రోజు మార్చురీ వద్ద మీడియాతో మాట్లాడానన్నారు. ఆ తర్వాత రెండ్రోజుల తర్వాత మీడియాతో మాట్లాడానన్నారు.
ఆరోజు ఏమి మాట్లాడానో ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నానన్నారు. సీబీఐ అధికారులకు కూడా అదే చెప్పానన్నారు. ఎవరు పిలిచి అడిగినా అదే చెబుతానన్నారు. సీఆర్‌పీసీ 160 కింద నోటీసు ఇచ్చి విచారిస్తున్నారని వివరించారు. సీబీఐ విచారణ సరైన విధానంలో జరగాలని కోరుతున్నానన్నారు.