– కోలుకుంటున్న గోదావరి పరివాహక ప్రాంతాలు
– పలు గ్రామాల్లో తగ్గిన వరద
– పునరావాస కేంద్రాల నుంచి ఇంటి దారి పట్టిన జనం
– బురదలో ఇళ్లు.. శుభ్రం చేసుకుంటూ అవస్థలు
భారీ వర్షాలు, వరదలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని ప్రజలు ఇప్పటిదాకా వరదలతో అల్లాడగా.. ఇప్పుడు బురదతో కుస్తీ పడుతున్నారు. ఒక్కొక్కరుగా పునరావాస కేంద్రాలను వీడుతున్న ప్రజలు తమ ఇళ్లకు వెళ్తే.. బురద స్వాగతం చెప్తోంది. దాన్ని ఎత్తివేసి ఇంట్లో సామాగ్రిని శుభ్రం చేసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు జనాలు.
ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలోని గ్రామాల్లోని ప్రజలు వరద తర్వాత వారి ఇళ్లను చూసి తట్టుకోలేక పోతున్నారు. గోడలు కూలిపోయి, సామాన్లు బురదతో నిండిపోయి ఉన్నాయి. కట్టు బట్టలతో బయటకు వచ్చి ఇప్పుడు కష్టాలతో ఇళ్లకు వెళ్లిన వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచి నీరు, ఆహార సామాగ్రి, కరెంట్ లేదని, ఇండ్లలో వరద వచ్చిన కారణంగా పాములు, తేళ్ళు దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు. వరద సమయంలో కనిపించిన నాయకులు ఇప్పుడు కానరావడం లేదని మండిపడుతున్నారు.
భద్రాద్రి జిల్లా బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం మండలాల్లోని చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వరదతోపాటు కొట్టుకొచ్చిన ఒండ్రుమట్టి, బురద ముంపు గ్రామాలను కమ్మేశాయి. తమ ఇళ్లను చూసుకుని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రాణాలు తప్ప సమస్తం కోల్పోయామంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 మండలాల ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. వరద కొద్దిగా నెమ్మదించడంతో క్రమంగా ఇళ్లకు చేరుకుంటున్న జనం తిండితిప్పలు మాని ఇళ్లల్లోంచి బురదను తొలగిస్తున్నారు.
వరదలో నాని కుళ్లిన చెట్లు, జంతువులు, చేపల కళేబరాలు, ఇతర వ్యర్థాల కారణంగా ముంపు ప్రాంతాల్లో దుర్గంధం నెలకొంది. ముంపు ప్రాంత ప్రజల్లో 90శాతం మంది వ్యక్తిగత ఆస్తులను నష్టపోయారు. వరద ముంచుకొస్తుండటంతో కట్టుబట్టలు, విలువైన సామాగ్రి మాత్రమే తీసుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లారు. దీంతో ఇళ్లలో ఉన్న ఇతర వస్తువులు బురదలో కొట్టుకుపోయాయి. ముంపు గ్రామాలన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొంది.