రోడ్ల పరిస్థితిపై తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ కేంద్రంపై తీవ్ర స్థాయిన మండిపడ్డారు. చెన్నై నుంచి రాణిపేట్ జాతీయ రహదారి అంతా గుంతలమయంగా ఉందని ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాసిన లేఖలో తెలిపారు. ఇది చెన్నైనుంచి… ఈ నగరంలోని పోర్టుల నుంచి కాంచీపురం, వెల్లూర్, రాణిపేట్, హోసూర్, కృష్ణగిరిల లోని పారిశ్రామికవాడలను కలుపుతుందని, అలాంటిది ఇంత పెద్ద నేషనల్ హైవే రోడ్డు అధ్వాన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్లలేక రైల్లో ప్రయాణించి తాను కొన్ని జిల్లాలను విజిట్ చేయాల్సివచ్చిందన్నారు. ఈ జాతీయ రహదారి దుస్థితి గురించి పార్లమెంటులో ఎంపీ దయానిధి మారన్ మీ దృష్టికి తెచ్చారని, కానీ మీ నుంచి వచ్చిన సమాధానం మాకేమాత్రం సంతృప్తి కలిగించలేదని స్టాలిన్ పేర్కొన్నారు. మీ స్పందన ఎలాంటి హామీనిచ్చే తరహాలో లేదన్నారు.
‘తమిళనాడులో జాతీయ రహదారుల ప్రాజెక్టుల అభివృద్ధికి మా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. కానీ ఈ విషయంలో మీ మంత్రిత్వ శాఖకు మా సర్కార్ ఎలాంటి సహకారం అందించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుండడం దురదృష్టకరం..ఇంకా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల విషయంలో మేం చొరవ తీసుకుంటున్నాం.. చెన్నై పోర్టు నుంచి మధురవాయిల్ ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టుకు రాయల్టీ చెల్లింపు మినహాయింపుతో సహా పలు చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆయన వివరించారు.
కానీ తమిళనాడు ప్రభుత్వం సహకరించడం లేదన్న ధోరణిలో మీరు పార్లమెంటులో మాట్లాడారని, ఇది విచారకరమని అన్నారు. ఇప్పటికైనా నేను ప్రస్తావించిన జాతీయ రహదారి అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటారని ఆశిస్తున్నానని స్టాలిన్ పేర్కొన్నారు.