హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ వడ్డెరబస్తీ వాసులు కలుషిత నీటితో నానా అవస్థలు పడుతున్నారు. కలుషిత నీటి బాధితుల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరికొందరు అస్వస్థతకు గురికావడంతో.. మొత్తం బాధితుల సంఖ్య 126కి చేరింది.
వాంతులు, విరేచనాలతో కొత్తగా 15 మంది కొండాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 52 మంది చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. అస్వస్థతకు గురైన వారిలో ఇప్పటివరకు 26 మంది రికవరీ అయినట్టు తెలిపారు.
కొండాపూర్ ప్రభుత్వ హాస్పిటల్ తో పాటు.. గాంధీ హాస్పిటల్ లోనూ కొందరు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంతో వడ్డెరబస్తీని సందర్శించిన జలమండలి ఎండీ దాన కిషోర్.. ఇంటింటికి వెళ్లి ప్రజల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.
బస్తీలో సరఫరా అవుతున్న నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బస్తీలో 69నల్లా కనెక్షన్లకు ట్యాప్ లు లేకపోవడంతో.. వాటికి సంబంధించిన మరమ్మత్తులు చేయించారు. మరుగుదొడ్ల పక్కన ఉన్న నీటి కనెక్షన్ల వల్ల నీరు కలుషితం అవుతోందని గుర్తించారు అధికారి.
Advertisements
ఓ వైపు బాధితుల ఆరోగ్యానికి ప్రమాదం ఏం లేదని అధికారులు చెప్తున్నప్పటికీ.. రోజురోజుకు కలుషిత నీటి బాధితులు పెరుగుతూ పోతోంది. ఇటు మరణాలు నమోదవుతున్నాయి. ఆదివారం భీమయ్య అనే స్థానికుడు మరణించగా.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు సోమవారం మృతి చెందింది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.