ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కన్ను మూశారు. ఆమె మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు కూడా మోడీ తల్లి మృతి పట్ల సంతాపం తెలిపారు.
ప్రధాని తల్లి మరణం పట్ల సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి, ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ప్రధాని తల్లి హీరాబెన్ ఆ దేవుడి పాదాలను చేరుకున్నారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. హీరాబెన్ మృతి పట్ల ఆమె తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రధానికి జరిగిన ఈ నష్టానికి ఈ దేశ ప్రజలంతా అండగా ఉంటారని గవర్నర్ ట్వీట్ చేశారు.
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా సంతాపం తెలిపారు. ప్రధాని మాతృమూర్తి మరణ వార్త తనను తీవ్రంగా కలిచి వేసిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తల్లీ బిడ్డల మధ్య ఉండే బంధం వెల కట్టలేనిదని ఆయన వివరించారు. ఈ సృష్టిలో ఇంతకన్నా విలువైనది ఏదీ లేదని చెప్పారు. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన దేవున్ని ప్రార్థించారు.
ప్రధాని తల్లి హీరాబెన్ స్వర్గస్తులయ్యారని తెలియడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మొదటి దైవం, తొలి గురువు అయిన మాతృమూర్తిని కోల్పోతే ఉండే దుఖం తనకు తెలుసని చెప్పారు. ఈ విచారకరమైన సమయంలో ప్రధానికి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు ట్వీట్ చేశారు.
ప్రధాని తల్లి హీరాబెన్ మృతి వార్త తనను తీవ్రంగా కలిచి వేసిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ బాధాకరమైన సమయంలో ప్రధాని కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రధాని మోడీ తల్లి హీరా బెన్ మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ప్రధాని మోడీ ప్రియమైన తల్లి హీరాబెన్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపారని చిరంజీవి తెలిపారు. స్వర్గలోకానికి బయలు దేరిన ఆమె ఆత్మకు ఆయన నివాళులర్పించారు.