బెంగుళూరులోని స్కూళ్లలో ఇటీవల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పిల్లల బ్యాగుల్లో మొబైల్ ఫోన్లే కాక, కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు, లైటర్లు, సిగరెట్లు, మత్తునిచ్చే వైట్నర్లు కనబడి అధికారులు నిర్ఘాంతపోయారు. ముఖ్యంగా 8, 9, 10 వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లో ఇవి లభించాయి.
నగరంలోని అనేక స్కూళ్లలో ఇటీవల విద్యాశాఖ అధికారులు ఈ తనిఖీలను నిర్వహించారు. విద్యార్థులు స్కూళ్లకు మొబైల్ ఫోన్లను కూడా తీసుకువెళ్తున్నారని అనేకమంది తలిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. విద్యా శాఖ ఈ స్పెషల్ డ్రైవ్ చేబట్టింది. దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెల్లడయ్యాక.. కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు.. తలిదండ్రులతోను, టీచర్లతోను సమావేశాలను నిర్వహించాయి.
విద్యార్థులకు తక్షణమే కౌన్సెలింగ్ ఇవ్వాలని ఈ సందర్భంగా పలువురు సూచించారు. తమ పిల్లల బ్యాగుల్లో ఇలాంటివి ఉన్నాయన్న విషయం తెలుసుకుని వారి పేరెంట్స్ షాకయ్యారని డెక్కన్ హెరాల్డ్ పేర్కొంది.
ప్రస్తుతానికి పిల్లలను సస్పెండ్ చేయరాదని, మొదట ఆయా స్కూళ్లకు నోటీసులు జారీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. నగరంలోని సుమారు 80 శాతం పాఠశాలల్లో ఈ తనిఖీలను నిర్వహించారు. తలిదండ్రులు కూడా తమ పిల్లల బ్యాగులను చెక్ చేస్తుండాలని, అనుమానాస్పదంగా ఏది కనబడినా వెంటనే వారిని నిలదీయాలని అధికారులు సూచిస్తున్నారు. అదే సమయంలో టీచర్లు సైతం తమ విద్యార్థుల ప్రవర్తనను గమనిస్తుండాలని కోరింది. ఇళ్లకు చేరుకున్న విద్యార్థుల ప్రవర్తనలో మార్పు గమనించిన కొంతమంది తలిదండ్రులు మొదట ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తేవడంతో ఈ ఆకస్మిక తనిఖీలు చేబట్టారు.