– మొళ్లీ మొదటికొస్తున్న కాంగ్రెస్!
– చేరికల విషయంలో అసంతృప్తిలో నేతలు
– రేవంత్ తీరుపై అసహనం!
– అద్దంకి లేఖ.. అయినా ఆగని రవి చేరిక
రెండు రోజుల క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పిన డైలాగ్ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల తుపాను ఉంటుందని అన్నారు. ఆ చేరికలు తుపాను ఏమోగానే.. పార్టీ నేతల్లో మాత్రం ఆ తుపాను కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మామూలుగా వలసలు ఉంటే పార్టీలో, క్యాడర్ లో ఉత్సాహం కనిపిస్తుంది. పార్టీ మరిత బలోపేతం అవుతుందనే ఆశ ఉంటుంది. కానీ.. తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం సీన్ వేరేలా ఉందని చెబుతున్నారు.

అయితే.. వడ్డేపల్లి రవి చేరిక విషయం మాత్రం కాంగ్రెస్ లో తుపానుకు కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అద్దంకి దయాకర్. పైగా రవి చేరింది కోమటిరెడ్డి సమక్షంలో. 2018 ఎన్నికల్లో రెబల్ గా పోటీ చేసిన రవిని ఆరేళ్ళపాటు పీసీసీ సస్పెండ్ చేసిందని అంటున్నారు దయాకర్. మరోవైపు పార్టీలో చేరిన తర్వాత రేవంత్ ని కలిసేందుకు రవి ఆయన ఇంటికి వెళ్లారట. అయితే.. ఆయన్ను కలిసేందుకు రేవంత్ ఇష్టపడలేదని.. మరోరోజు కలుద్దామని తన మనుషులతో చెప్పి పంపిచినట్లు చెబుతున్నారు.
తన జిల్లాకు చెందిన తాటి వెంకటేశ్వర్లు చేరికపై ఎలాంటి సమాచారం లేదని భట్టి విక్రమార్క సీరియస్ గా ఉన్నారనే చర్చ నడుస్తుండగా.. ఇప్పుడు రవి చేరిక తర్వాత అద్దంకి దయాకర్ ఏం చేస్తారనేది ఇంట్రస్టింగ్ గా మారిందని అంటున్నారు విశ్లేషకులు. ఇవి చినికి చినికి పెద్దగా మారితే పార్టీకి నష్టం తెచ్చి పెడుతుందని హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ లోకి ఇంకా చేరికలు ఉంటాయని రేవంత్ వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోంది. మరి.. ఆయా నియోజకవర్గాల్లో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.