– గులాబీ క్యాంప్ లో కుమ్ములాటలు
– తెరపైకి రోజుకో గొడవ
– మాజీలను పట్టించుకోని కేసీఆర్
– అసంతృప్తిలో ఆయా నేతల క్యాడర్
– హిట్ లిస్టులో 30 మంది
– సిట్టింగులపై సారుకు అందిన నివేదిక
– కదిలిస్తే ఊహకందని నష్టం!
ఎవడి తప్పులకు వాడే బాధ్యుడు అనేది నానుడి. ప్రతిపక్షమే లేకుండా చేద్దామని ఎవరినిపడితే వారిని పార్టీలోకి చేర్చుకున్నారు కేసీఆర్. అంతేనా.. ఆనాడు ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసిన వారిని అందలం ఎక్కించి నిజమైన ఉద్యమకారులకు ద్రోహం చేశారనే విమర్శలను మూటగట్టుకున్నారు. అయినా కూడా తనదైన వ్యూహాలతో ముందుకెళ్తూ 8 ఏళ్లుగా నెట్టుకొస్తున్నారు. కానీ.. కారులో ఓవర్ లోడ్ తో స్టీరింగ్ ఎటుబడితే అటు తిరుగుతోంది. రోజుకో పంచాయితీ కేసీఆర్ ముందుకొస్తోంది. ఒకదాన్ని సైలెంట్ చేసేలోపు ఇంకో ప్రమాదం వచ్చి పడుతోంది. అయితే.. ఈ గొడవలన్నింటిలో సిట్టింగ్ లకే కేసీఆర్ వంత పాడుతుండడం.. మాజీలకు నచ్చడం లేదు.
గత రెండు పర్యాయాల్లో కారు గుర్తుతో ఓడిపోయినవారు చాలామందే ఉన్నారు. కానీ.. వారిని ఓడించిన వారు తిరిగి అదే కారులోకి ఎక్కారు. దాని ఫలితంగా చాలాచోట్ల పార్టీ నేతల్లో గొడవలు జరుగుతున్నాయి. తనను ఓడించి.. పార్టీలో చేరి అధికార చలాయిస్తావా అంటూ మాజీలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అటు మొదట్నుంచి పార్టీలో ఉన్నవారు కూడా గొడవకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వరంగల్ పంచాయితీనే చూడండి. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, గుడిమళ్ల రవికుమార్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ విషయంలో కేసీఆర్.. వినయ్ భాస్కర్ వైపే ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రవికుమార్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్నారు. న్యాయవాదిగా, ఉద్యమకారుడిగా గుర్తింపు ఉంది. అయితే.. ఈమధ్య ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దానికి కారణంగా ఎమ్మెల్యేనే అని బహిరంగంగా ఆయన విమర్శలు చేస్తున్నారు. బెయిల్ పై బయటకొచ్చాక కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పిల్లల్ని తానే చంపేసుకున్నట్లు.. అధిష్టానం వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. వినయ్ భాస్కర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని స్పష్టం చేశారు. పార్టీలో తన స్థానం ఏంటన్నదానిపై ఆయన తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాకతీయ న్యాయవాదుల హౌసింగ్ కో ఆపరేటివ్ సంస్థ ప్లాట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో రవికుమార్ అరెస్ట్ అయ్యారు.
నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వీరేశం మధ్య పంచాయితీ మామూలుగా లేదు. లింగయ్య 2014 ఎన్నికల్లో వీరేశం చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఈయన తర్వాత టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అంతే.. వీరేశంకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. తనను ఓడించిన వ్యక్తి పార్టీలోకి రావడంతో అతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. తర్వాత వీరేశానికి చెందిన మనుషులు జైలు పాలు అవడంతో ఎమ్మెల్యే కక్షగట్టారనే ఆరోపణలు వినిపించాయి. దీనికితోడు ఆయనకు థ్రెట్ ఉందని తెలిసి కూడా గన్ మెన్లను తొలగించడం పెద్ద వివాదాస్పదమే అయింది. ఇలా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పంచాయితీలు చాలాచోట్ల ఉన్నాయి.
కొల్హాపూర్ నియోజకవర్గంలోనూ ఇదే తంతు. స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మధ్య వార్ జరుగుతోంది. వరుసగా ఐదుసార్లు గెలిచి రికార్డ్ సృష్టించిన జూపల్లిని గత ఎన్నికల్లో హర్షవర్ధన్ ఓడించారు. ఫలితాల తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యేకే ఎక్కువ ప్రాధాన్యత ఉడడంతో అధిష్టానంపై జూపల్లి అసహనంతో ఉన్నారనే ప్రచారం ఉంది. పోలీసులు ఎవరూ తనను పట్టించుకోవడం లేదని ఆమధ్య ఆయనే బహిరంగంగా ప్రకటించారు కూడా. తనలో ఉన్న అసంతృప్తిని అధిష్టానానికి తెలియజేసేందుకే మొన్న జరిగిన ప్లీనరీకి కూడా వెళ్లలేదని వార్తలు వచ్చాయి.
పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తుమల్ల నాగేశ్వరరావుకు పడడం లేదు. తన అనుచరులను జైలు పాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చూడడం లేదని బహిరంగంగానే అన్నారు. ఉపేందర్ రెడ్డి కూడా 2018 ఎన్నికల్లో తుమ్మలను ఓడించి.. తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ఇల్లందులోనూ ఇదే పరిస్థితి. అంతర్గత కలహాలు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణుల్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఇలా అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతల మధ్య గొడవలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.
అసలే.. పార్టీలో కుమ్ములాటలతో సతమంతం అవుతున్న కేసీఆర్ కు పీకే ఇచ్చిన నివేదిక తలనొప్పిగా మారిందని అంటున్నారు రాజకీయ పండితులు. దాదాపు 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఆయన సూచించారట. దానికి కారణాలు లేకపోలేదు. ఆయా ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని చెబుతున్నారు. కబ్జాలు, హత్యలు, బెదిరింపులు, ఇలా చాలా విషయాల్లో ఎమ్మెల్యేల ఇన్వాల్వ్ మెంట్ ఉంటోందని.. అది ఏనాటికైనా ప్రమాదం తీసుకురావొచ్చని పీకే హెచ్చరించారని అంటున్నారు విశ్లేషకులు. అయితే.. ఇక్కడ వచ్చిన చిక్కల్లా.. ఆ ఎమ్మెల్యేల జోలికెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఊహకందడం లేదు. 30 మందిని మారిస్తే వారంతా ఎన్నికల సమయానికి రోడ్లు ఎక్కితే ఎలా అనే తర్జనభర్జనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు విశ్లేషకులు.
ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పుంజుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత చూస్తే రోజురోజుకీ పెరుగుతోంది. పోలీసులతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యేలపై ప్రజలు రగిలిపోతున్నారు. అటు చూస్తే.. నేతల మధ్య సఖ్యత ఉండడం లేదు.. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలా వద్దా? అనే మీమాంసలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు. ఒకరకంగా చెప్పాలంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి అనేలా ఉందని చెబుతున్నారు.