– ఖమ్మం టీఆర్ఎస్ లో కుమ్ములాట
– పొంగులేటికి చెక్ పెట్టే ప్రయత్నాలు?
– ప్రగతి భవన్ లో పల్లా.. జిల్లాలో సండ్ర, తుమ్మల
– ఒక్కడిని చేసి వెంటాడుతున్నారా?
ప్రతిపక్షం లేకుండా చేద్దాం.. అప్పుడు మనం ఆడిందే ఆట.. పాడిందే పాట.. అడిగేవాడు ఉండడు.. ఈ ఆలోచనతోనే ప్రతిపక్షాల నుంచి ఎవరు వచ్చినా రెడ్ కార్పెట్ వేసి మరీ పార్టీ కండువా కప్పేశారు గులాబీ బాస్. ఆ సమయంలో అది కాస్త లాభించినా.. పోనుపోను టీఆర్ఎస్ లో ఓవర్ లోడ్ పెద్ద తలనొప్పిగా తయారైంది. అప్పటిదాకా ఒకరినొకరు తిట్టుకున్న నేతలంతా ఒకే వేదికను పంచుకోవాల్సి పరిస్థితి. పైకి నవ్వుతూ పలకరించుకున్నా.. లోపల లోపల ఎప్పుడు తొక్కేద్దామా? అనే ఆలోచనతోనే నెట్టుకొస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పెద్ద బాస్ దగ్గర ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు తుమ్మల పడుతున్న తిప్పలు చూసి రాజకీయ విశ్లేషకులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ బాడీ కోటాలో ఎంఎల్సీగా ఎన్నికైన తాత మధు అభినందన సభలో తుమ్మల చేసిన వ్యాఖ్యలు ఖమ్మం రాజకీలపై అందరూ ఫోకస్ చేసేలా చేశాయి. ఓవైపు మధును అభినందిస్తునే ఇంకోవైపు పొంగులేటిపై పరోక్షంగా విమర్శలు సంధించారు తుమ్మల. కొందరు.. పెళ్లి ఒకరితో కాపురం మరొకరితో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మధుని ఓడించడానికి పొంగులేటి ప్రయత్నాలు చేశారనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటు తాత మధు తుమ్మలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఆయన టీఆర్ఎస్ లో చేరాకే జిల్లాలో పార్టీ అభివృద్ధి జరిగిందన్నారు. వీరిద్దరి కామెంట్స్ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారగా.. పొంగులేటికి పొమ్మనక పొగబెట్టే వ్యూహంతోనే అలా మాట్లాడారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన పొంగులేటిని టీఆర్ఎస్ నుండి వెళ్లగొట్టాలనే లక్ష్యంతో పల్లా, సండ్ర, తుమ్మల, తాత మధులతో పాటు మంత్రి పువ్వాడ అజయ్ పావులు కదుపుతున్నారనే అనుమానాలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాదరణ ఉన్న నాయకుడిగా, నిత్యం ప్రజలలో ఉంటున్న నేతగా పొంగులేటికి ఇమేజ్ ఉంది. ఈయనతో ఎప్పటికైనా తమకు త్రెట్ అనే భావన వారందరికీ ఉందని.. అందుకే ఆయనను టార్గెట్ చేసారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాత మధుకి లోకల్ బాడీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ పరోక్షంగా వ్యతిరేకించినవారే. అంతేకాదు కేటీఆర్ కి కూడా ఇష్టం లేదనే వార్తలు వినిపించాయి. కేసీఆర్ దగ్గర తనకున్న పలుకుబడిని ఉపయోగించి మధుకు బీ ఫామ్ ఇప్పించారని జిల్లా మంత్రి అజయ్ కూడా అయిష్టంగానే మధు గెలుపుకోసం పని చేశారని.. అందుకు నామినేషన్ ప్రక్రియ నుండి ఓటింగ్ జరిగే వరకు జరిగిన పరిణామాలే నిదర్శనమని అంటున్నారు విశ్లేషకులు. ఫలితాల తర్వాత మధు గెలిచాక భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఎవరికి వారు భుజాలు తడుముకొని అందరు కలిసి పొంగులేటిపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. తుమ్మల కూడా మధుని గెలిపించాలని గట్టిగా చెప్పిన దాఖలాలు కూడా లేవని అంటున్నారు. గెలిస్తే తన కృషి ఓడితే పొంగులేటి ద్రోహం అని చెప్పాలనేది తుమ్మల ముందు నుండే ప్రిపేర్ అయ్యారని విశ్లేషిస్తున్నారు.
మధుని అభ్యర్థిగా ప్రకటించే సమయంలో మంత్రుల మీటింగ్ జరిగింది. ఆ సమయంలో తుమ్మల, పొంగులేటిపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. వారిద్దరికీ ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చేశాం.. ఇక భవిష్యత్ లో ఎలాంటి ప్రయారిటీ ఇచ్చేది లేదని చాలా స్పష్టంగా కేసీఆర్ చెప్పారని.. ఆ విషయాన్ని మంత్రులు తుమ్మల, పొంగులేటి చెవిలో వేశారని అంటున్నారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే.. తాను మంచివాడినని కలరింగ్ ఇస్తూ పొంగులేటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని చెప్పి కేసీఆర్ కి దగ్గర కావాలనేది తుమ్మల ప్రయత్నంగా కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పొంగులేటిని పార్టీ నుండి వెళ్లగొట్టాలంటే అందరం ఐక్యంగా ఉండాలని సండ్ర వెనకుండి కథంతా నడిపి తుమ్మలను రంగంలోకి దింపారని చెబుతున్నారు. పైగా మీరు చేయాల్సింది చేయండి… ప్రగతి భవన్ లో తాను చేయాల్సింది చేస్తానని పల్లా కూడా సండ్ర, మధుల చెవిలో వేసారని అంటున్నారు. అలాగే.. తుమ్మలనే ముందు పెట్టి కథ నడపండి మంత్రి అజయ్ అయితే సహకరించడు అని కూడా పల్లా అన్నారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. మొత్తానికి పొంగులేటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయనేది అర్థం అవుతోంది. అయితే, తుమ్మల వ్యవహారంపై ఆయన అనుచరులు గుర్రుగా వున్నట్లు తెలుస్తోంది. అవసరం లేని సబ్జెక్ట్ లో తల దూర్చి తన స్థాయి తగ్గించుకున్నారని బాధపడుతున్నారట. ఈ విషయంలో జలగం వెంకట్రావు చాలా హుందాగా ఉన్నారని గుర్తు చేసుకుంటున్నారు. జిల్లాలో రాజకీయంగా చాలా సీనియర్ అయి ఉండి.. తనకు సంబంధం లేని విషయంలో వేలు పెట్టి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం బాలేదని తుమ్మల అభిమానుల్లో చర్చ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.