తెలంగాణ కాంగ్రెస్ లో గొడవలు లేకపోతే నాయకులకు నిద్ర పట్టేలా లేదు. అన్నీ సమసిపోయి కలిసి కట్టుగా ఉంటామని ప్రకటన చేసి వారం రోజులు కూడా గడవక ముందే మరో లొల్లి మొదలైంది. ఈసారి ఏకంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకే కంప్లయింట్ లేఖ వెళ్లింది. అద్దంకి దయాకర్ ఈ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
సీనియర్ లీడర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డి, దామోదరరెడ్డిపై సోనియాకు ఫిర్యాదు చేశారు అద్దంకి దయాకర్. ఈనెల 6న ఈ లేఖ రాసినట్లుగా అందులో ఉంది. 2018 ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన వడ్డేపల్లి రవిని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆ లేఖలో వివరించారు దయాకర్.
కాంగ్రెస్ బహిష్కృత నేత రవిని పార్టీలో చేర్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 2018లో ఆయన రెబల్ గా పోటీ చేసి తన ఓటమికి కారణం అయ్యారని అన్నారు. పార్టీ రవిని సస్పెండ్ చేసిందని.. ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డి మళ్లీ పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తుంగతుర్తిలో పార్టీకి నష్టం చేసిన రవిని మళ్ళీ తీసుకొవద్దని కోరారు దయాకర్.
