– హాత్ సే హాత్ యాత్రతో నెట్టుకొస్తున్న టీకాంగ్రెస్
– 13 నియోజకవర్గాల్లో రేవంత్ యాత్ర కంప్లీట్
– కానీ, పార్టీ నుంచే రేవంత్ కు తప్పని పోటీ
– సమాంతర యాత్రకు ఏలేటి స్కెచ్
– అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్!
– రెండు యాత్రల క్రాష్ కి ఛాన్స్
– అయోమయంలో క్యాడర్
ప్రజా సమస్యలపై పోరు, ప్రభుత్వ విధానాలపై పోరు చేయాల్సిన సమయంలో కాంగ్రెస్ ను మాత్రం ఏదో రకంగా అంతర్గతపోరు పట్టిపీడిస్తూనే ఉంది. పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఎంట్రీతో లోపల లుకలుకలున్నా.. బయటికి మాత్రం అందరూ సర్దుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు సమాంతరంగా మరో యాత్రకు స్కెచ్ పడింది.
భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశ వ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో అభియాన్ పేరుతో పాదయాత్రలు నిర్వహించాలని ఏఐసీసీ అన్ని రాష్ట్రాల పీసీసీలను ఆదేశించింది. ఇందులో భాగంగా అన్ని నియోజక వర్గాల్లో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలు కొనసాగుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈనెల 6 వ తేదీ నుంచి వరంగల్ , ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ‘యాత్ర ఫర్ ఛేంజ్’ పేరుతో ముందుకు కొనసాగుతున్నారు.
ఇప్పటికే 13 నియోజక వర్గాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో కూడలి సమావేశాలకు భారీగా జనం తరలి వస్తుండడంతో పార్టీలో కాస్త జోష్ వచ్చిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కార్నర్ సమావేశాల్లోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో కూడా ప్రజలకు వివరించుకుంటూ యాత్ర కొనసాగుతుంది. రేవంత్ యాత్రలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, సీనియర్ నాయకుడు వీహెచ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో పాటు ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొంటున్నారు.
అయితే రేవంత్ యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండగానే.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర రెడ్డి కూడా మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు’ కాంగ్రెస్ తెలంగాణ పోరు యాత్ర’ పేరుతో సమాంతరంగా యాత్ర నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు.
మార్చి 3 నుంచి మొదలయ్యే ఈ యాత్ర బాసర నుంచి హైదరాబాద్ వరకు 20 రోజుల పాటు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రేవంత్ రెడ్డి యాత్ర నిర్వహించినా…తాము తెలంగాణ పోరు యాత్ర పేరుతో చేపట్టినా.. హాత్ సే హాత్ జోడో అభియాన్ లో భాగమేనని ఏలేటీ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇక ఈ పాదయాత్ర సజావుగా కొనసాగేందుకు ఆయన అధ్యక్షతన 12 మందితో ఓ కమిటీ ఏర్పాటైంది. కాంగ్రెస్ అధిష్టానం అనుమతితోనే తాను పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెబుతున్న మహేశ్వర రెడ్డికి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు ఎలా మద్దతు ఇస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.