- తెలంగాణలో ముందస్తు తొందరలో పార్టీలు
- ఆరా సర్వే ఫలితాలతో గందరగోళంలో నేతలు
- పోటాపోటీగా బిజెపి-కాంగ్రెస్ లీడర్ల విమర్శలు
ఓవైపు తెలంగాణలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, ప్రాజెక్టులతో జనం అల్లాడిపోతున్న పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వాన బీభత్సంతో అతలాకుతలమైన వేళ.. ఆయా పార్టీలు రానున్న ఎన్నికల్లో అధికారం కోసం తాపత్రయపడుతూ రాజకీయాలు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాలు వరదల్లో కూరుకున్న సమయంలో ప్రస్తుతం పార్టీల పరిస్థితిపై ఆరా సంస్థ ఇచ్చిన సర్వే.. రాజకీయ వర్గాల్లో పెద్దుఎత్తున దుమారం రేపింది.
సర్వేలతో రాజకీయ పార్టీలు గేమ్స్ ఆడటం సర్వసాధారణం అయింది. వాటి ద్వారా ప్రజల మూడ్ ను మార్చడానికి చేసే కుయుక్తులు ఎన్నో. అందుకే, కోట్లాది రూపాయలను సర్వే సంస్థలకు ఇస్తూ అనుకూలంగా సర్వే ఫలితాలను క్రియేట్ చేసే సంస్కృతి ఇటీవల కాలంలో పెరిగింది. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఆరా సర్వే రిపోర్టు పెద్దఎత్తున చర్చకు తెరలేపింది. అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీల నుంచి ముందస్తు మాటలు వినిపించడంతో.. ఇప్పుడు ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించిన సర్వే వివరాలు సంచనలంగా మారాయి.
తాజాగా విడుదల చేసిన‘ఆరా’ సర్వే వివరాల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ 8 శాతం ఓట్లను కోల్పోతుందని అంచనా వేసింది. అదే సమయంలో బీజేపీ ఓట్ షేర్ గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ మరింతగా ఓటు షేర్‌ను నష్టపోతుందని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు 38.88 శాతం ఓట్లు, బీజేపీకి 30.48 శాతం, కాంగ్రెస్‌కు 23.71 శాతం, ఇతరులకు 6.91 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. అయితే తెలంగాణలో ఒకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. కూటమికి అవకాశం లేదని ఆ సర్వే పేర్కొంది.
అయితే ఆరా సంస్థ సర్వే పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. సర్వే నిర్వహించిన వ్యక్తి బీజేపీ నాయకుడని.. అతడు ప్రధాని మోదీని కలిశాడని.. తెలంగాణ ప్రజలను మోసం చేయడం కోసం బీజేపీ తరఫున తప్పుడు సర్వేలు చేస్తున్నాడని తెలంగాణ కాంగ్రెస్ మండిపడింది. తమ సర్వేలు తమకు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ఆరా మస్తాన్ గతంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన వీడియోలను షేర్ చేస్తూ.. బీజేపీతో అతడికి అనుబంధం ఉన్న విషయాన్ని కాంగ్రెస్ అభిమానులు ప్రస్తావిస్తున్నారు. ఓవైపు తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే బిజెపి సర్వే తతంగాన్ని నడిపించిందనే ఆరోపణలు గుప్పిస్తున్నారు హస్తం పార్టీ నేతలు.
ఇటీవల టీఆర్ఎస్ సీనియర్ నేత నల్లాల ఓదేలు.. గ్రేటర్ కార్పొరేటర్ విజయారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.. ఇలా వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి నేతల వలసలు జోరందుకున్నాయి. గాంధీభవన్ కు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. రేవంత్ రెడ్డి వరుసగా చేపట్టిన కార్యక్రమాలతో హస్తం పార్టీ కేడర్ లో జోష్ కనిపిస్తోంది. అయితే, ఇదే సమయంలో కొన్ని రోజులుగా బీజేపీలోకి వలసలు నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం రేసులో కాంగ్రెస్ కంటే బీజేపీ వెనకబడిందనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఇటీవల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు, ప్రధాని మోడీ బహిరంగ సభతో హడావుడి చేసింది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా రాష్ట్రానికి దేశ వ్యాప్తంగా ఉన్న బిజెపి అగ్రనేతలు, అతిరథమహారథులు, ఉద్దండ నేతలు పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. అయితే పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నా కాషాయ పార్టీలో నేతల చేరికలు జరకపోవడంతో కొంత స్తబ్ధత నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరా సంస్థ సర్వే వెల్లడించడం… ఆ రిపోర్టులో మూడోసారి టీఆర్ఎస్ దే అధికారమని తేల్చి చెప్పడంతో పాటు రెండోస్థానంలో బిజెపి నిలిచిందనే వార్తలతో అటు కాంగ్రెస్ వర్గాల్లో, ఇటు రాజకీయ విశ్లేషకుల్లో కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరా సంస్థ సర్వే వెనుక బిజెపి హస్తముందనే విమర్శలు చేస్తున్నారు.
మరి ఆరా సంస్థ సర్వే పొలిటికల్ మైలేజ్ కోసమా.. లేక వాస్తవంగానే రానున్న ఎన్నికలకు ఒక నిర్ధిష్ట సూచికనా అనేది మరికొన్ని రోజులు గడిస్తే తెలుస్తుంది.