– చేరికలు డల్.. సఖ్యత నిల్!
– గందరగోళంలో బండి క్యాంప్!
– కోవర్టుల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో మాట
– ఉన్న కొద్దిమంది నేతలకు కాంగ్రెస్ పిలుపు
– లక్ష్యం నెరవేరాలంటే తమవైపు రావాలంటున్న రేవంత్
– విజయశాంతికి విషెస్ చెప్పడం వెనుక కారణాలేంటి?
బీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం.. కాంగ్రెస్ ఎప్పుడో ఖతమైంది.. త్వరలో చేరికల తుపాను చూస్తారు.. ఇలా ఎన్నో మాటలు చెప్పారు బీజేపీ నేతలు. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అయితే.. మైకుల ముందు తెగ ఊదరగొట్టారు. కానీ, అనుకున్నవేవీ జరగక.. కాంగ్రెస్ లో ఒకప్పుడు ఎలాంటి గందరగోళం ఉండేదో ఇప్పుడు బీజేపీలో అదే కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పండితులు. తాజా పరిణామాల నేపథ్యంలో విశ్లేషకులు ఇలా రియాక్ట్ అవుతున్నారు.
కోవర్టుల విషయంలో కమలనాథులు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అయ్యారు. ప్రతిపక్షాల్లో కేసీఆర్ మనుషులు ఉన్నారని ఈటల రాజేందర్ అంటే.. ఎంపీ లక్ష్మణ్ మాత్రం వెరైటీగా స్పందించారు. కేసీఆర్ కోవర్టులు బీజేపీలో ఉండి చేసేదేమీ లేదన్నారు. సరైన సమయంలో తమ పార్టీలోకి భారీగా చేరికలుంటాయని స్పష్టం చేశారు. తాము చేరికలపై ఆధారపడమని.. తెలంగాణపై ప్రధాని మోడీ, అమిత్ షా కు ప్రత్యేక వ్యూహముందని చెప్పారు. నిజానికి కోవర్టులు ఏం చేస్తారో అందరికీ తెలుసు. పార్టీని సర్వనాశనం చేయడంలో వీళ్లదే కీలకపాత్ర. మరి.. అలాంటివారి గురించి లైట్ తీసుకున్నట్టు లక్ష్మణ్ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు బండి సంజయ్ వెర్షన్ మరోలా ఉంది. తమ పార్టీలో అసలు కోవర్టులే లేరని అంటున్నారాయన. బీజేపీలో కోవర్టులున్నారని ఈటల అనలేదని.. కొన్ని మీడియా ఛానళ్లు వక్రీకరించాయని చెబుతున్నారు. నిజానికి ఈటల రాజేందర్ చెప్పింది ప్రతిపక్షాల్లో కోవర్టుల సంగతి. తెలంగాణలో బీజేపీ ప్రతిపక్షమే. మరి.. అప్పుడు బీజేపీలో కూడా ఉన్నట్టే కదా అని వివరిస్తున్నారు విశ్లేషకులు. బీజేపీలో కొన్నాళ్లుగా పార్టీ నేతల మధ్య సఖ్యత చెడిందని.. ఓ గందరగోళ పరిస్థితి నెలకొందని రాజకీయవర్గాల్లో టాక్ ఉంది. తమ పార్టీలోకి చేరికల తుపాను ఉంటుందని చెప్పడమే గానీ.. కమలనాథుల అంచనాలకు తగ్గట్టు ఏదీ వర్కవుట్ కావడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు బీజేపీలో నెలకొన్న పరిస్థితిని క్యాష్ చేసుకునే పనిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అంతర్గత కలహాలు తొలగి ఇప్పుడిప్పుడే హస్తం పార్టీలో అన్నీ చక్కబడుతున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీలో నెలకొన్న గందరగోళాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారట రేవంత్. ఇప్పటికే అసంతృప్త నేతలకు ఆయన ఆహ్వానం పంపారు. ఈటల లక్ష్యం నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ సరైనదని సందేశం పంపించారు. ఆయన్నే కాదు మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ తో పాటు విశ్వేశ్వర్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారు రేవంత్. మీ లక్ష్యం బీజేపీలో ఉంటే నెరవేరదని.. వారిని దువ్వే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారని చెబుతున్నారు విశ్లేషకులు.
అసలే బీజేపీలో చేరికలు అంతంత మాత్రంగా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి భారీగా లీడర్లు వస్తారని చెప్పుకున్నా ఎవరూ కమలం పార్టీ వైపు చూడడం లేదు. కేసీఆర్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీ నేతలను కంట్రోల్ లో పెట్టుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న నేతల్ని కూడా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుండటంతో బండి సంజయ్ క్యాంప్ లో అయోమయం నెలకొందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ప్రధాని మోడీ, షా తెలంగాణపై భారీ ఫోకస్ పెట్టారని చెబుతున్నా.. చేరికలు డల్ గా ఉండడం.. అంతర్గత కలహాలు నెలకొనడం.. ఉన్నవారు ఎప్పుడు ఝలక్ ఇస్తారో తెలియని పరిస్థితి ఉండడంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్ కమలం పార్టీలో కనిపిస్తోందని అంటున్నారు.