[sonaar_audioplayer artwork_id=”” feed=”https://tolivelugu.com/wp-content/uploads/2022/05/trs-cong-bjp.mp3″ player_layout=”skin_float_tracklist” hide_progressbar=”default” display_control_artwork=”false” hide_artwork=”false” show_playlist=”false” show_track_market=”false” show_album_market=”false” hide_timeline=”false”][/sonaar_audioplayer]
– కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
– మీవంటే మీవి కుమ్మక్కు రాజకీయాలంటూ తిట్లు
– నిజంగా.. టీఆర్ఎస్ కు బీజేపీ సహకరిస్తోందా?
– కాంగ్రెస్ కు టీఆర్ఎస్ లాభం చేకూరుస్తోందా?
– లేక.. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయా?
– ఎవరితో ఎవరు కలిశారు.. కన్ఫ్యూజన్ లో ప్రజలు
టీఆర్ఎస్, బీజేపీ ఒకటంటోంది కాంగ్రెస్.. లేదు.. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటని చెబుతోంది బీజేపీ.. అలా కాదు.. బీజేపీ, కాంగ్రెస్ ఒకటని అంటోంది టీఆర్ఎస్. ఇంతకీ ఎవరితో ఎవరికి దోస్తీ.. ఎవరికి కుస్తీ. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తుక్కుగూడ సభ సందర్భంగా కేసీఆర్ సర్కార్ పై అమిత్ షా బాగానే గరమయ్యారు. నయా నిజాం.. అవినీతి ప్రభుత్వం.. ఎంఐఎం, టీఆర్ఎస్ అవిభక్త కవలలు.. డబ్బులు కేంద్రానివి.. ప్రచారం టీఆర్ఎస్ ది అంటూ తీవ్రస్థాయిలోనే మండిపడ్డారు. కానీ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షా ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఓ ట్వీట్ చేశారు. అమిత్ షా ప్రసంగం కొండంత రాగం తీసి… అన్నట్టుగా ఉందన్నారు. ప్రజల తరఫున తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదని.. కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఆర్భాటపు ప్రకటనలే తప్ప ఆచరణతో కూడిన చర్యలు ఉండవని తేలిపోయిందని మండిపడ్డారు. అంతేలే షాజీ.. మీ చీకటి మిత్రుడిపై ఈగవాలనివ్వరుగా? అంటూ ఫైరయ్యారు.
రేవంత్ వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమనేది కాంగ్రెస్ శ్రేణుల వాదన. 2014 అధికార పీఠం ఎక్కింది మొదలు టీఆర్ఎస్, బీజేపీ అంటకాగుతూ వచ్చాయని గుర్తు చేస్తున్నారు. పార్లమెంట్ లో బిల్లులకు మద్దతు తెలపడం.. రాష్ట్రంలో ఒకలా.. ఢిల్లీలో మరోలా వ్యవహరించడం చూసి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. పైగా కేసీఆర్ ప్రతీసారి కేంద్రంపై యుద్ధమని ప్రకటించడం.. తర్వాత చల్లబడడం కామన్ అయిపోయింది. దీన్నిబట్టి రెండు పార్టీలు కలిసి డ్రామా చేస్తున్నాయని స్పష్టం అవుతోందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అంతేకాదు.. ఆర్నెళ్లకోసారి జాతీయ నేతల్ని తీసుకురావడం.. కేసీఆర్ అంత అవినీతి చేశాడు.. ఇంత చేశాడు.. కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడేశారు అని విమర్శలు చేయడం తప్ప ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు శూన్యం. క్విడ్ ప్రోకో పద్దతిలో చీకటి ఒప్పందం ప్రకారం బీజేపీ, టీఆర్ఎస్ సహకరించుకుంటున్నాయని.. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అమిత్ షా వ్యాఖ్యలపై సెటైరికల్ గా స్పందించారని చెబుతున్నారు.
నిజానికి తెలంగాణలో బీజేపీకి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు ఉన్నంత బలమైన క్యాడర్ లేదు. టీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్ అనేలా పరిస్థితులు ఉన్నాయి. దీన్ని గ్రహించే కేసీఆర్ ప్రతిపక్షమే లేకుండా చేయాలని.. కాంగ్రెస్ నేతల్ని భారీగా చేర్చుకున్నారు. కానీ.. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక పరిస్థితులు తారుమారయ్యాయి. క్యాడర్ లో కొత్త ఉత్తేజం వచ్చింది. ఎక్కడ సభ పెట్టినా వేలల్లో జనం తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను ఎదగనీయకుండా బీజేపీ, టీఆర్ఎస్ కలిసి నాటకాలు చేస్తున్నాయని అంటున్నారు హస్తం నేతలు.
ఇక బీజేపీ వాదన చూస్తే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటేనని అంటోంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కదిలించే శక్తి కాంగ్రెస్ కు లేదని.. అందుకే ప్రాంతీయ పార్టీలతో చీకటి ఒప్పందాలను కుదుర్చుకునే పనిలో ఉందని విమర్శిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకరికొకరు పరోక్షంగా సహకరించుకుంటారని.. పార్లమెంట్ ఎన్నికల్లో నేరుగా కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదని చెబుతోంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని.. ఈ మధ్య బండి సంజయ్ పదే పదే ఈ విషయం గురించి చెబుతున్నారు. ఆ రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ ను పీకే ముందు పెట్టి డ్రామా చేస్తున్నారని అంటున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గెలవాలని, రాష్ట్రంలో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి తీసుకువచ్చే క్రమంలో అధికార వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ తో గేమ్ ఆడుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని వ్యూహాలు రచించినా ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని.. బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి కేసీఆర్, కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు కమలనాథులు.
మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ ఒకటనేది టీఆర్ఎస్ వాదన. పార్లమెంట్ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పని చేశాయని గుర్తు చేస్తోంది. అంతేకాదు ధాన్యం కొనుగోలు విషయంలో తాము బీజేపీపై పోరాటం చేస్తుంటే.. రాహుల్ గాంధీ పార్లమెంట్ బయట గానీ, లోపల గానీ ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని చెబుతోంది. తెలంగాణలో బీజేపీ గెలుపుకోసం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే ఆరాటపడుతోందని అంటోంది టీఆర్ఎస్. మొన్నటికి మొన్న హుజూరాబాద్ ఎన్నికల్లో జరిగింది ఏంటని ప్రశ్నిస్తోంది. ఈటలను గెలిపించేందుకు కాంగ్రెస్ పడిన తాపత్రయం ఎవరూ మర్చిపోరని గుర్తు చేస్తోంది. మొత్తానికి ఎవరి వెర్షన్ వారిదే అన్నట్లుగా విమర్శలు చేసుకుంటున్నాయి పార్టీలు. కానీ.. ప్రజలు మాత్రం ఎవరితో ఎవరున్నారు? ఎవరెవరు కలిసిపోయారు? అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారని చెబుతున్నారు రాజకీయ పండితులు.