కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ )సెక్యూర్టీ తొలగించడంపై హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలంటూ లోక్ సభలో కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. అమిత్ షా సమాధాానానికి కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో అమిత్ షా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రాణాలకు ముప్పు ఉందని కాంగ్రెస్ సభ్యలు తెలిపారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ఈ ముగ్గురికి ఎస్పీజీ సెక్యూర్టీని తొలగించి సీఆర్పీఎఫ్ సెక్యూర్టీని ఏర్పాటు చేశారు. సోనియాగాంధీ కుటుంబసభ్యులకు ఎస్పీజీ సెక్యూర్టీ తొలగించడంపై చర్చకు ఆ పార్టీ నేత ఆధిర్ రంజన్ చౌదరి వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. వాజ్ పేయ్ ప్రభుత్వంలో కూడా సోనియా గాంధీ కుటుంబసభ్యులకు ఎస్పీజీ సెక్యూర్టీని తొలగించలేదన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లారు. స్పీకర్ ఓం బిర్లా సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరినా వినకుండా ప్రధాన మంత్రి సమాధానం ఇవ్వాలని, రాజకీయ ప్రతికార చర్యలు మానుకోవాలని, నియంతృత్వానికి చరమగీతం పాడాలని, వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యలు సభ నుంచి వాకౌట్ చేశారు.
