కాంగ్రెస్ ఎంపీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన పొలిటికల్ రిటైర్మెంట్ గురించి సంచలన ప్రకటన చేశారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తి కానుండటం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. భారత్ జోడో యాత్ర పార్టీకి గొప్ప మలుపు అని తెలిపారు.
చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు వ్యక్తిగతంగా తనకు చాలా సంతృప్తినిచ్చాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ను మలుపుతిప్పిన భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం తనకు సంతోషాన్నిస్తోందన్నారు. దేశ ప్రజలంతా సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరకుంటున్నారని యాత్ర రుజువు చేసిందని ఆమె అన్నారు.
పార్టీతో పాటు దేశం మొత్తానికి కూడా ఇది సవాళ్లతో కూడిన సమయమన్నారు. దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ-ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్న సమయం ఇదన్నారు. కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని ఆమె మండిపడ్డారు.
ప్రజల్లో విద్వేషాగ్నిని బీజేపీ రగులుస్తోందన్నారు. మైనారిటీలు, మహిళలు, దళితులు, గిరిజనులను బీజేపీ లక్ష్యంగా చేసుకుందన్నారు. రాజ్యాంగ విలువలను ప్రభుత్వ చర్యలు కాలరాస్తున్నాయని ఆమె ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.